కాకులు వాలని కొండ – Kotappakonda Sri Trikoteswara Swami Temple Must Visit in 2026:
Kotappakonda Sri Trikoteswara Swami Temple – ఆంధ్రప్రదేశ్‌లోని శైవ క్షేత్రాలలో అత్యంత మహిమాన్వితమైనది మరియు చారిత్రక ప్రాశస్త్యం కలిగినది కోటప్పకొండ. గుంటూరు జిల్లా / పల్నాడు జిల్లా నరసరావుపేటకు చేరువలో, ప్రకృతి ఒడిలో మూడు శిఖరాల కలయికగా వెలసిన ఈ త్రికూట పర్వతం భక్తుల పాలిట కల్పవల్లి. దీనిని త్రికూట పర్వతం లేదా కొండవీడు కొండలు అని కూడా పిలుస్తారు. ఈ పర్వతం మూడు కొండలతో రూపొందింది. అందుకే త్రికూట పర్వతం అని పేరు వచ్చింది. ఇక్కడ వెలసిన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అలముకున్న ఈ పుణ్యక్షేత్రం, ముఖ్యంగా మహాశివరాత్రి వేడుకలకు పెట్టింది పేరు. ఈ వ్యాసంలో మనం కోటప్పకొండ విశిష్టత, అక్కడ జరిగే ప్రభల ఉత్సవం మరియు భక్తులకు అందుబాటులో ఉన్న వసతుల గురించి సమగ్రంగా తెలుసుకుందాం.
ప్రతి ఏటా ఫిబ్రవరి-మార్చి నెలల్లో వచ్చే మహాశివరాత్రి ఇక్కడ ప్రధాన పండుగ. ఈ సమయంలో వేలాది మంది భక్తులు తరలివచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకలను జరుపుకుంటారు.
📢 Join Our WhatsApp Channel here:
త్రికూట పర్వతాలు:
కూటము అంటే మూడు శిఖరములు కలిగినటువంటిది. ఈ క్షేత్రం మూడు శిఖరములతో ఉంటుంది. వలయాకృతిలో తిరుగుతూ ఉంటే ప్రధానంగా మూడు శిఖరాలు కనిపిస్తాయి, ఆ మూడు శిఖరములు ఏమిటి అంటే ఒకటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, రెండు స్థితికర్త అయినటువంటి విష్ణువు, మూడు ప్రళయకర్త అయినటువంటి హరుడు, ఈ ముగ్గురు మూడు శిఖర రూపములలో ప్రకాశిస్తూ ఉంటారు. కోటప్పకొండ కొండను ఏ దిశ నుండి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి, అందుకే దీనిని త్రికూటాద్రి లేదా త్రికూట పర్వతం అని పిలుస్తారు.

ఈ మూడు కొండలను దూరం నుండి స్పష్టంగా చూడవచ్చు. అవి:
- బ్రహ్మ శిఖరం: ప్రధాన ఆలయమైన త్రికోటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడే ఉంది.
- రుద్ర శిఖరం: ఇక్కడ పాత కోటయ్య ఆలయం ఉంది. త్రికోటేశ్వర స్వామి మొదట ఇక్కడే ఉండేవారని ప్రతీతి. గొల్లభామ అనే భక్తురాలి గొప్ప భక్తికి మెచ్చి, స్వామివారు బ్రహ్మ శిఖరానికి వెళ్లారని చెబుతారు. అందుకే దీనిని పాత కోటయ్య ఆలయం అని పిలుస్తారు.
- విష్ణు శిఖరం: ఇక్కడ పాపనాశేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ మహావిష్ణువు పరమశివుని కోసం తపస్సు చేశారని నమ్ముతారు. ఇక్కడే “పాపనాశ తీర్థం“ అనే పవిత్రమైన కోనేరు కూడా ఉంది.
ఘాట్ రోడ్డు ప్రయాణంలో వ్యూ పాయింట్లు (Viewpoints):
కోటప్పకొండలో పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉంటారు. కొండ మీదకి ఘాట్ రోడ్ 4.5 కిలోమీటర్లు ఉంటుంది. కొండమీదకి మెట్ల మార్గం నుంచి కూడా వెళ్లవచ్చు. ఈ ఘాట్ రోడ్డు ప్రారంభంలో విజయ గణపతి ఆలయం, సాయిబాబా ఆలయం కనిపిస్తాయి. ఘాట్ రోడ్డు మలుపుల వద్ద బ్రహ్మ, లక్ష్మీనారాయణ, త్రిమాతలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి), మరియు విఘ్నేశ్వరుని భారీ విగ్రహాలను మనం చూడవచ్చు. మార్గమధ్యంలో పిల్లల పార్కు, ఒక మ్యూజియం మరియు కాళీయమర్దన విగ్రహం భక్తులను ఆకట్టుకుంటాయి.
కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ పర్యాటకుల కోసం అనేక ఆకర్షణలు ఉన్నాయి:
- గుహలు మరియు వ్యూ పాయింట్లు (Viewpoints)
- బటర్‌ఫ్లై పార్క్ (సీతాకోకచిలుకల వనం), డీర్ పార్క్ (జింకల వనం), మరియు నెమళ్ల ఎన్‌క్లోజర్
- చిల్డ్రన్ పార్క్, బోటింగ్ సౌకర్యం మరియు మ్యూజియం
- భక్తుల సౌకర్యార్థం క్యాంటీన్ వసతి కూడా ఉంది.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పవిత్ర క్షేత్రానికి ఏరియల్ రోప్ వే (Aerial Ropeway) నిర్మించే ప్రణాళికను కూడా చేపట్టింది.
ఇక్కడ ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం ఉంటుంది, దీనిని గొల్లభామ మందిరం అని కూడా అంటారు. త్రికోటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందు ఈ ఆనందవల్లి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఆనందవల్లి పరమశివుడి భక్తురాలు, గొల్లజాతి కాబట్టి గొల్లభామ అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వెళ్లి పరమశివుడిని సేవిస్తే జాతకంలో గురు బలం పెరుగుతుంది అని చెప్తారు, గురు బలం పెరిగితే రక్షణ పొందుతారు. పిల్లలకు విద్యాభివృద్ధి కలుగుతుంది.

ఇక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది.
మనం గర్భాలయంలో శివలింగాన్ని చూస్తే ఎంతో ప్రశాంతతను పొందుతాము. శివలింగం పెద్దగా ఉంటుంది. దర్శనం అయ్యి బయటకు వస్తే ఎడమవైపు ఒక యజ్ఞశాల లాంటి ప్రదేశం ఉంటుంది, దానిలో కోటప్పకొండ మరియు ఈ త్రికూటేశ్వరం ఎలా ఏర్పడిందో చిత్ర రూపంలో వివరించబడి ఉంటుంది. ఇక్కడ శివుడు బ్రహ్మచారి రూపంలో ఉన్నారు అని చెప్తారు. కొండ పైన పెద్ద వినాయకుడి విగ్రహం, మేధా దక్షిణామూర్తి ఆలయం కూడా ఉంటాయి.
కోటప్పకొండ మీద కాకి వాలకపోవడానికి కారణం ఏంటి ?
త్రికూట పర్వతాలకు దక్షిణ దిశలో సుందుడు, కుందిరి అనే దంపతులు నివసించేవారు. వారికి ఆనందవల్లి అనే అందమైన కుమార్తె జన్మించిన తర్వాత వారు ఎంతో సంపన్నులయ్యారు. ఆనందవల్లి చిన్నప్పటి నుండి శివభక్తురాలు. ఆమె తన సమయాన్ని ఎక్కువగా రుద్ర శిఖరంపై ఉన్న పాత కోటేశ్వర స్వామి సేవలో గడిపేది. క్రమంగా ఆమెకు ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గి, శ్రీ కోటేశ్వర స్వామి కోసం తపస్సు ప్రారంభించింది.
సతీదేవి అగ్నిలో ఆహుతి అయిన తర్వాత పరమశివుడు 11 సంవత్సరాల బాలుడు రూపంలో రుద్ర శిఖరం మీద కూర్చుని తపస్సు చేసుకునేవారు, ఆనందవల్లి అమ్మవారు ఆవిడ రోజు వచ్చి ఆవు, గేదెలు అక్కడ మేపుతూ ఉండేది. పరమశివుడు ఆకలి తీర్చుకోవడం కోసం ఈవిడ ఆవులలో ఒక ఆవు పాలు త్రాగేవాడు. ఈవిడ రోజు వచ్చి పశువులను మేపుకొని ఇంటికి వెళ్ళేది, ఒకరోజు ఆవిడ తండ్రి అడుగుతాడు, ఒక ఆవు పాలు ఇవ్వట్లేదు ఏమిటి అని. ఆవిడ తనకి ఏమీ తెలియదని చెప్తుంది.
మరుసటి రోజు మళ్లీ పశువులను మేపడానికి కొండకి తీసుకెళ్తుంది, ఆవిడ తండ్రి కూడా వెనకాల వస్తాడు ఏం జరుగుతుందో చూడ్డానికి, స్వామి పాలు తాగడం చూసి, స్వామి నువ్వు పాలు తాగేస్తే మాకు సరిపోవు మేము పేదవాళ్ళం, మేము ఎలా బ్రతుకుతాం? అని అడుగుతాడు. దానికి స్వామి నేను తాగింది గిద్దెడు పాలు, గిద్దెకు ఆరు గిద్దలపాలు కలుస్తాయి అని చెప్తాడు, దానికి ఆనందవల్లి తండ్రి, స్వామి ఇలా ఆవు దగ్గర పాలు తాగొద్దు, అమ్మాయితో పంపిస్తాను అని చెప్పి, రోజు గొల్లభామతో(ఆనందవల్లి ) పాలు పంపిస్తాడు.
రోజు ఆవిడ కింద నుంచి రుద్ర శిఖరం మీదకి కుండతో పాలు, పెరుగు అన్నం మోసుకుని వెళ్లి శివుడికి ఇచ్చేది. ఒకరోజు అలా తీసుకొచ్చేటప్పుడు పువ్వులు కోయడానికి అని కుండ పక్కకి పెట్టి పువ్వులు కోస్తుంది, ఒక కాకి వచ్చి కుండ లో ఉన్న పాలు ఎంగిలి చేస్తుంది, ఎంగిలి పాలు నివేదనకి పనికి రావని ఇంటికి వెళ్లి మళ్లీ వేరే పాలు తీసుకొచ్చి రుద్ర శిఖరం మీద ఉన్న స్వామికి ఇస్తే, అర్చక స్వామి ఈరోజు నైవేద్యం సమయం దాటిపోయింది. పాలు, పూలు పనికిరావు తీసుకువెళ్ళమని చెప్తాడు. దానికి ఆవిడ చాలా బాధపడి ఈ మూడు శిఖరాల మీద కాకి “కా” అంటే ప్రపంచ నాశనం అవుతుంది శపిస్తుంది. ఆశ్చర్యకరంగా అప్పటి నుండి ఇప్పటివరకు రుద్ర శిఖరంపై కాకులు కనిపించవు.
స్వామి దర్శనం కన్నా ముందు ఆనందవల్లి అమ్మవారుని ఎందుకు దర్శించుకోవాలి?
స్వామి ఆవిడ భక్తి ని పరీక్షించాలని జంగమదేవర రూపంలో వచ్చి కన్యగా ఉన్న ఆనందవల్లి గర్భవతి అయ్యేటట్లుగా ఆశీర్వదిస్తారు. అయినా ఆవిడ గర్భంతోనే, క్రమం తప్పకుండా కొండ మీదకి నైవేద్యం కుండలో తీసుకు వెళ్ళేది. రోజు కొండ ఎక్కి దిగలేక స్వామిని కిందకి, ఊరిలోకి రమ్మని అడుగుతూ ఉండేది. అప్పుడు స్వామి నువ్వు వెనక్కి తిరగకుండా వెళ్ళు నీ వెనకే వస్తాను అని చెప్తారు. ఆవిడ నడుస్తూ ఉంటే స్వామి రుద్ర శిఖరం మీద నుండి బ్రహ్మ శిఖరం మీదకు కాలు పెట్టగానే పెద్ద శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాలకి స్వామికి ఏమైందో అని వెనక్కి తిరిగి చూసింది చూడగానే నుంచున్న ప్రదేశంలో ఆవిడ శిల అయిపోతుంది. స్వామి అడుగు పెట్టిన ప్రదేశంలో కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగ రూపం దాల్చారు. ఈ పవిత్ర స్థలమే ప్రస్తుతం ‘కొత్త కోటేశ్వర ఆలయం‘గా ప్రసిద్ధి చెందింది.
స్వామి ఆవిడకి ఒక వరం ఇస్తారు ఈ ఆలయంలో స్వామి దర్శనం కన్నా ముందు గొల్లభామ(ఆనందవల్లి అమ్మవారి) దర్శనం చేయాలి అని, ఆలయంలో గొల్లభామ అమ్మవారిని దర్శించి మన కోరికలు ఆవిడకి చెప్తే ఆవిడ అయ్యవారికి చెప్తుంది, అప్పుడు స్వామి మన కోరికలు నెరవేరుస్తారని స్థలపురాణం. ఈ ఆలయంలో పెద్ద నంది విగ్రహం ఉంటుంది.
వివాహాలు జరగని క్షేత్రం (నిషిద్ధం):
దక్షయజ్ఞాన్ని వినాశనం చేసిన తర్వాత, పరమశివుడు శాంతించి ఒక 12 ఏళ్ల బాలుడి రూపంలో దక్షిణామూర్తిగా కైలాసంలో కఠోర తపస్సు ప్రారంభించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు ఆయనను ప్రార్థించి, తమకు “బ్రహ్మ జ్ఞానాన్ని“ ప్రసాదించవలసిందిగా కోరారు. దానికి అంగీకరించిన దక్షిణామూర్తి, వారిని త్రికూట పర్వతాలకు రమ్మని చెప్పి, అక్కడ వారికి జ్ఞానబోధ చేశారు. దక్షిణామూర్తి ఇక్కడ నిత్య బ్రహ్మచారిగా ఉండి బోధనలు చేసినందువల్ల, ఈ ఆలయంలో ఎటువంటి వివాహాలు జరగవు.
ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కోటప్పకొండ తిరనాళ్లు జరుగుతాయి, అలాగే కార్తీక వనభోజన మహోత్సవాలు కూడా జరుగుతాయి. మహాశివరాత్రి ఉత్సవాల్లో ప్రభలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. వెదురు బద్దలతో దీర్ఘచతురస్రాకారంలో అడుగున వెడల్పుగా, పైకి వెళ్లేకొద్దీ సన్నగా ఉండేలా వీటిని నిర్మిస్తారు. వీటిని శివుని ఫోటోలు, విగ్రహాలు, రంగురంగుల బట్టలు మరియు పేపర్లతో అలంకరిస్తారు. సాధారణంగా ఇవి 60-70 అడుగుల ఎత్తు ఉంటాయి. కానీ కొన్ని భారీ ప్రభలు 100 అడుగుల ఎత్తు వరకు ఉండి, శివరాత్రి రాత్రి వేళ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతుంటాయి.

కావూరు (దీనికి 70 ఏళ్ల చరిత్ర ఉంది), నరసరావుపేట, అప్పాపురం, కమ్మవారిపాలెం వంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో భక్తితో ఈ ప్రభలను తయారుచేసి ఊరేగింపుగా కొండకు తీసుకువస్తారు.
త్రికోటేశ్వర తత్త్వం: పంచకృత్య పరమేశ్వరుడు:
కోటప్పకొండపై వెలసిన త్రికోటేశ్వరుడు కేవలం సృష్టి, స్థితి, లయకారకుడు మాత్రమే కాదు, వేదాంత శాస్త్రం పేర్కొనే తిరోధానము (మాయతో సత్యాన్ని కప్పడం), అనుగ్రహము (మోక్షాన్ని ప్రసాదించడం) అనే మరో రెండు శక్తులతో కూడిన పంచకృత్య పరాయణుడు. భారతదేశంలో ‘త్రికూటం’ అనే పేరు కలిగిన ఏకైక పర్వతం ఇది.
త్రిమూర్తి స్వరూపం:
పరమేశ్వరుడు ఈ ముగ్గురికీ అతీతుడై ఉంటూనే వారి ద్వారా ఈ లోక కార్యాలను నిర్వహిస్తుంటాడు. నిజానికి ఆ ముగ్గురూ ఆయన స్వరూపాలే:
బ్రహ్మగా ఉండి సృష్టిని చేస్తాడు.
విష్ణువుగా నిలిచి లోకాన్ని కాపాడతాడు.
హరునిగా మారి ప్రళయకాలంలో సర్వస్వాన్ని తనలోకి ఉపసంహరించుకుంటాడు.

సదాశివ తత్త్వం – అనుగ్రహం:
ఏ ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసే భక్తులకు, ఆయన తన అనుగ్రహంతో చిత్తశుద్ధిని ప్రసాదిస్తాడు. ఆ చిత్తశుద్ధి ద్వారా లభించే అర్హతతో భక్తులకు పునర్జన్మ లేని శాశ్వత శివ సాయుజ్య స్థితిని కల్పిస్తాడు. ఇది ‘సదాశివ’ తత్త్వం—అక్కడ కేవలం మంగళప్రదమైన శాంతమే ఉంటుంది తప్ప అపకారానికి చోటు లేదు.
లింగరూప రహస్యం:
మనం శివలింగం ముందు నిలబడినప్పుడు గ్రహించవలసిన పరమార్థం ఒకటి ఉంది. ఈ సృష్టిని నడిపిస్తున్న ఆ పరమాత్మ సామాన్య నేత్రాలకు గోచరించడు. అటు బ్రహ్మదేవుడు ఆకాశ మార్గాన వెళ్ళినా, ఇటు విష్ణుమూర్తి పాతాళం దాటి వెతికినా, ఆయన ఆది అంతాలను కనుగొనలేకపోయారు. అంతరిక్షం కంటే పైన, పాతాళం కంటే దిగువన ఉంటూ ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్న అనంతుడు ఆయన.
త్రికోటేశ్వర వైభవం: అనంత జ్ఞాన స్వరూపం:
సాణువు – సర్వవ్యాప్త స్థితి:
పరమశివుడికి ‘సాణువు’ అని పేరు. సాణువు అంటే కదలిక లేనివాడు అని అర్థం. ఆయన అంతటా నిండిపోయి ఉన్నాడు కాబట్టి, ఇక కదలడానికి ఖాళీ ప్రదేశమే లేని పరిపూర్ణ స్థితి అది. ఆ పరబ్రహ్మమే సృష్టి, స్థితి, లయకారకుడిగా, తిరోధానం కలిగించే మహేశ్వరుడిగా, అనుగ్రహాన్నిచ్చే సదాశివుడిగా పంచకృత్యాలను నిర్వహిస్తూ ‘లింగ’ రూపంలో వెలిశాడు. సమస్త చరాచర జగత్తు ఆ లింగం నుండే ఉద్భవించి తిరిగి దానిలోనే లీనమవుతుంది.

శివశాసనం – దేవతా సార్వభౌమత్వం:
ఆయన ముప్పై మూడు కోట్ల దేవతలకు సార్వభౌముడు. ఏ దేవత అయినా ఆయన శాసనాన్ని అతిక్రమించలేదు, అదే ‘శివశాసనం’. శ్రీకాళహస్తిలో నవగ్రహాలే కవచంగా కలిగిన ఆ శాసనకర్త ఆజ్ఞను సమస్త విశ్వం శిరసావహిస్తుంది.
జ్ఞానరాశి – క్షేత్ర విశిష్టత:
త్రికోటేశ్వరుడు రాశీభూతమైన జ్ఞాన స్వరూపం. లోకంలో అత్యున్నతమైనది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇచ్చే దాత ఆయన. జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి ఉన్నచోట మనకు లభించనిది అంటూ ఏదీ ఉండదు. అందుకే ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. లోకానికి మార్గదర్శనం చేయగలిగే మహాపురుషులు, మహనీయులు ఈ క్షేత్ర అనుగ్రహం చేతనే ఉద్భవిస్తుంటారు.
త్రికూట మహత్యం: జగద్గురువుల జన్మరహస్యం:
త్రికూట క్షేత్రం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. లోకానికి మార్గదర్శనం చేసే మహాపురుషులను ప్రసాదించే జ్ఞానభూమి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం శృంగేరి శారదా పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జననం.
శివానుగ్రహం – శృంగేరి జగద్గురువులు:
భారతీ తీర్థ స్వామి వారి తండ్రి గారు నరసరావుపేట ప్రాంతంలో నివసించేవారు. వారు ప్రతి నిత్యం కోటప్పకొండ ఎక్కి త్రికోటేశ్వరుని దర్శించుకునేవారు. అలాగే స్వామివారి తల్లిగారు కూడా తన బాల్యం నుండి నిత్యం కొండపైకి వెళ్లి ఆ శివలింగాన్ని భక్తితో సేవించేవారు. ఆ దంపతుల నిష్కల్మష భక్తికి మెచ్చిన త్రికోటేశ్వరుడు వారి గర్భాన తానే పుడతానని అనుగ్రహించాడు.
ఫలితంగా సాక్షాత్తు శంకరాచార్య స్వరూపులు, అపార తపోనిష్ఠా గరిష్టులు, వాగ్దేవి అనుగ్రహం పొందిన సరస్వతీ స్వరూపులైన మహాస్వామి వారు జన్మించారు.
ఒక ఉత్తమ సంతానం లభిస్తే ఏడు తరాలు ఉద్ధరించబడతాయని శాస్త్రం చెబుతోంది. అటువంటి మహనీయుడు పుట్టడానికి కారణం ఆ త్రికోటేశ్వరుని కరుణే.
అరూపరూపి – త్రికోటేశ్వరుడు:
భారతదేశం మొత్తంలో ఇలాంటి విశిష్టమైన పర్వతం మరెక్కడా కనిపించదు. ఈ పర్వతంపై స్వామి లింగ రూపంలో వెలిశాడు. లింగం అంటే ‘అరూపరూపి’ (రూపం ఉండి కూడా రూపం లేని అనంతుడు).
అరూపరూపి: శివలింగ రహస్యం:
రూపం ఉందా…? అంటే ఉంది, కచ్చితంగా ఉందా…. అంటే? లేదు..
శివలింగానికి కాళ్లు చేతులు ఉంటాయా…. ? లేదు…. అలా అని రూపం లేకుండా ఉందా….? రూపం ఉన్నది….
రూపం లేనిది…, అరూపరూపిగా వెలిసి ఉంటాడు.
అరూపరూపి అంటే రూపం ఉండి కూడా లేనివాడని అర్థం. శివలింగాన్ని మనం చూస్తున్నాం కాబట్టి దానికి ఒక ఆకారం (రూపం) ఉంది. సాకార, నిరాకార తత్వాలకు మధ్యస్థంగా ఉండే అద్భుత స్థితి ఇది.
బ్రహ్మసూత్రం – అత్యంత శక్తివంతమైన లింగం:
శైవాగమం ప్రకారం, శివలింగం ఎంత శక్తివంతమైనదో గుర్తించడానికి ‘బ్రహ్మసూత్రం’ ఒక ప్రధాన ఆనవాలు.
శివలింగం పైభాగం నుండి కింది వరకు, మళ్ళీ పైకి తిరిగి పక్కకు వెళ్లే రేఖలను (గీతలను) బ్రహ్మసూత్రం అంటారు.
కేవలం పరమ శక్తివంతమైన లింగాలకు మాత్రమే ఈ బ్రహ్మసూత్రాలు చెక్కబడి ఉంటాయి.
త్రికోటేశ్వర క్షేత్రంలోని లింగం అటువంటి అరూపరూపి మరియు బ్రహ్మసూత్ర విభూషితమైన మహాలింగం.
ప్రళయకర్తగా పరమశివుడు:
ఈ లింగం నిత్య ప్రళయం నుండి మహాప్రళయం వరకు అన్నిటినీ నిర్వహిస్తుంది.
నిత్య ప్రళయం (నిద్ర): ప్రాణులన్నీ గాఢనిద్రలో మునిగిపోవడాన్నే నిత్య ప్రళయం అంటారు. లోకంలో నిద్రను మించిన సుఖం లేదు. రోజంతా అలసిన ఇంద్రియాలకు విశ్రాంతినిచ్చి, తిరిగి ఉత్తేజపరిచేవాడు ఆ శివుడే.
మహాప్రళయం – జ్ఞాన ప్రదాత: మహాప్రళయం అంటే కేవలం అంతం మాత్రమే కాదు, అది పరిపూర్ణమైన జ్ఞానోదయం. శివానుగ్రహం కలిగితే పుస్తకాలలోని విషయాలే కాక, ఒక చిన్న విషయాన్ని విన్నా దాని పూర్వాపరాలు, లోతైన అర్థాలు వాటంతట అవే మనసులో భాసిస్తాయి.
శివానుగ్రహానికి నిదర్శనం: కంచి పరమాచార్యుల ఉదంతం:
శివానుగ్రహం ఉంటే జ్ఞానం ఎలా ప్రకాశిస్తుందో చెప్పడానికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి (మహాస్వామి) వారి జీవితంలోని ఘటనే సాక్ష్యం.
వారు శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించినప్పుడు, కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ఒక రహస్యాన్ని వెల్లడించారు.
ఆలయ ద్వారానికి ఎదురుగా ఉన్న పొదలను తొలగించి చూడమని చెప్పారు. అక్కడ కొండపై అద్భుతంగా చెక్కబడిన ‘పార్వతీ కళ్యాణ’ దృశ్యం బయటపడింది.
అంతేకాకుండా అక్కడి మహాబిల్వ వృక్షమే ఆ క్షేత్రానికి అసలైన స్థలవృక్షమని వారు తన జ్ఞానదృష్టితో నిర్ధారించారు.
శివానుగ్రహం: జ్ఞానానికి, కీర్తికి మూలధనం:
కంచి పరమాచార్యుల దివ్య దృష్టి – శ్రీశైల వృత్తాంతం:
ఒకసారి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు శ్రీశైల క్షేత్రంలో బావి నీటితో అభిషేకం చేస్తూ ధ్యానమగ్నులయ్యారు. అప్పుడు వారు ఒక రహస్యం చెప్పారు: “మల్లికార్జున లింగాన్ని స్పృశిస్తూ భూమి అంతర్భాగం నుండి ఒక జలధార ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తోంది. ఇక్కడ ఒక తాటి చెట్టు లోతు తవ్వితే ఆ పవిత్ర తీర్థం మీకు కనిపిస్తుంది” అని నిర్దేశించారు. అప్పటి దేవస్థానం అధికారి సముద్రాల రామకృష్ణమూర్తి గారు తవ్వించగా, సరిగ్గా శివలింగం కింద నుండి వచ్చే ఆ జలధార ఒక తటాకంలా దర్శనమిచ్చింది. మహానుభావులకు శివానుగ్రహం వల్ల కలిగే దివ్యదృష్టికి ఇది ఒక నిదర్శనం.
వాగ్దేవికి మూలం – మహేశ్వర సూత్రాలు:
లోకంలోని సమస్త భాషకు, వాజ్మయానికి మూలం శివుడి డమరుకమే. ఆయన డమరుకాన్ని 14 సార్లు వాయించగా ‘మహేశ్వర సూత్రాలు’ ఉద్భవించాయి. వాటి నుండే ‘అ’ కారం నుండి ‘క్ష’ కారం వరకు గల 50 అక్షరాలు పుట్టాయి. దీనినే ‘అక్షమాల’ అంటారు.
తమిళనాడు సంప్రదాయం: అక్కడ బిడ్డ పుట్టినప్పుడు వాడు గొప్ప విద్వాంసుడు కావాలని, చరిత్రలో నిలిచిపోయే కీర్తిని గడించాలని కోరుకుంటూ ‘అక్షమాల’ను బహుకరిస్తారు.
బంగారు లేదా వెండి కాసులపై అక్షరాలను లిఖించి, అక్షరాభ్యాసం రోజున శివలింగానికి లేదా శారదాదేవికి సమర్పించి, అనంతరం ఆ శిశువు మెడలో అలంకరిస్తారు. అంటే, సరస్వతీ కటాక్షం అన్నా, అక్షర జ్ఞానం అన్నా అది శివానుగ్రహమే.
శివభక్తుల వైభవం – పోతన, ఉపమన్యువు:
జ్ఞానాగ్నిని రగిలించడంలో శివానుగ్రహం సాటిలేనిది.
బమ్మెర పోతన: 12 స్కంధాల భాగవతాన్ని అద్భుతమైన తెలుగులో ఆంధ్రీకరించిన పోతన గారు పరమ శివభక్తులు. శివకేశవ భేదం లేకుండా ఆయన పొందిన ఆ కవితా ప్రాభవం శివుని వరప్రసాదమే.
భక్త ఉపమన్యువు: చిన్నతనంలో ఆవు పాలు కావాలని అడిగిన ఉపమన్యువుకు తల్లి “లోకతండ్రి అయిన శివుడే నీ తండ్రి, ఆయనే ఇవ్వగలడు” అని చెప్పింది. ఆ బాలుడి నిష్కల్మష తపస్సుకు మెచ్చిన పరమశివుడు, కేవలం పాలు మాత్రమే కాదు.. ఏకంగా క్షీర సాగరాన్నే (పాలసముద్రాన్ని) సృష్టించి ఇచ్చాడు. ఆయన దాతృత్వం అంతటి అగాధమైనది.
త్రికోటము: అక్షరాభ్యాస ప్రశస్త క్షేత్రం:
ఆంధ్ర దేశంలో అక్షరాభ్యాసానికి అత్యంత యోగ్యమైన ప్రదేశం త్రికోటము (కోటప్పకొండ). జ్ఞాన స్వరూపుడైన త్రికోటేశ్వరుడు వెలిసిన ఈ క్షేత్రంలో విద్యారంభం చేస్తే, ఆ బిడ్డ అపారమైన పాండిత్యాన్ని, లోక ప్రఖ్యాతిని పొందుతాడు.
కోటప్పకొండ క్షేత్రానికి చేరుకునే మార్గాలు మరియు అభివృద్ధి:
అమరావతి, గుంటూరు, విజయవాడల నుండి సులభ రవాణా సౌకర్యం కోటప్పకొండ క్షేత్రానికి కలదు. కోటప్పకొండ క్షేత్రానికి సమీప రైల్వే స్టేషన్: నరసరావుపేట. కొత్త కోటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడానికి భక్తుల సౌకర్యార్థం కాలక్రమేణా అనేక మార్పులు జరిగాయి:
- మెట్ల మార్గం: ఈ ప్రాంతాన్ని పాలించిన గుండా రాయలు, 1761లో భక్తులు కొండపై ఉన్న కొత్త ఆలయానికి సులభంగా చేరుకోవడానికి మెట్ల మార్గాన్ని నిర్మించారు.
- ఘాట్ రోడ్డు: ఆ తర్వాత, ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో, ఆలయానికి చేరుకోవడానికి 3 కిలోమీటర్ల పొడవైన ఘాట్ రోడ్డును నిర్మించారు.
- ఆధ్యాత్మిక ఆకర్షణలు: ఈ ఘాట్ రోడ్డు ప్రారంభంలో విజయ గణపతి ఆలయం, సాయిబాబా ఆలయం కనిపిస్తాయి. ఘాట్ రోడ్డు మలుపుల వద్ద బ్రహ్మ, లక్ష్మీనారాయణ, త్రిమాతలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి), మరియు విఘ్నేశ్వరుని భారీ విగ్రహాలను మనం చూడవచ్చు.
- వినోదం మరియు సంస్కృతి: మార్గమధ్యంలో పిల్లల పార్కు, ఒక మ్యూజియం మరియు కాళీయమర్దన విగ్రహం భక్తులను ఆకట్టుకుంటాయి.
- రోప్ వే సౌకర్యం: భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పవిత్ర క్షేత్రానికి ఏరియల్ రోప్ వే (Aerial Ropeway) నిర్మించే ప్రణాళికను కూడా చేపట్టింది.
టాలీవుడ్ షూటింగ్ స్పాట్:
తెలుగు సినిమా అభిమానులందరికీ అక్కినేని నాగేశ్వరరావు గారి ‘ప్రేమాభిషేకం’ సినిమాలోని “కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా“ అనే పాట బాగా పరిచయం. ఈ ప్రాంతం సినీ కళాకారులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం మరియు సినిమా షూటింగ్‌లకు ఒక ఆకర్షణీయమైన కేంద్రం. పల్నాటి బ్రహ్మనాయుడు, సుకుమారుడు వంటి పలు ప్రజాదరణ పొందిన చిత్రాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి.
kotappakonda sri trikoteswara swamy temple timings – కోటప్పకొండ దేవాలయం దర్శన సమయాలు:
| కార్యకలాపం | సమయం | రోజులు |
| ఆలయ ద్వారము తెరిచే సమయం | ఉదయం 6:00 | సోమవారం – ఆదివారం |
| ఉదయకాల దర్శనం | ఉదయం 6:00 – మధ్యాహ్నం 1:00 | సోమవారం – ఆదివారం |
| విరామ సమయం (బ్రేక్) | మధ్యాహ్నం 1:00 – సాయంత్రం 3:00 | సోమవారం – ఆదివారం |
| సాయంకాల దర్శనం | సాయంత్రం 3:00 – రాత్రి 8:00 | సోమవారం – ఆదివారం |
| ఆలయం మూసివేసే సమయం | రాత్రి 8:00 | సోమవారం – ఆదివారం |
Kotappakonda Sri Trikoteswara Swami Temple Accommodation Information – వసతి గృహాల వివరాలు:
కొండ పైన యాత్రికుల కోసం వివిధ వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు మరియు ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
| అతిథి గృహం పేరు | గది అద్దె (రోజుకు) |
| ఆనందవల్లి అతిథిగృహం | రూ. 250 |
| తోట వారి అతిథిగృహం | రూ. 300 |
| నంది అతిథిగృహం | రూ. 750 |
Kotappakonda Sri Trikoteswara Swami Temple Abhishekam information –
కోటప్పకొండ దేవాలయంలో అభిషేక సేవల వివరాలు:
| అభిషేకం రకం | ధర (రూపాయలలో) | సమయాలు |
| సాధారణ అభిషేకం | ₹100 | ఉదయం 6:00 – మధ్యాహ్నం 12:15 |
| మూలవిరాట్ అభిషేకం | ₹400 | పర్వదినాల్లో, ఉదయం 5:00 – మధ్యాహ్నం 2:00 |
| మండప అభిషేకం | ₹150 | పర్వదినాల్లో, ఉదయం 5:00 – మధ్యాహ్నం 2:00 |
| మహాశివరాత్రి పరోక్ష అభిషేకం | ₹600 | మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున |
| శాశ్వత అభిషేకం (10 ఏళ్లు) | ₹2,116 | భక్తుల కోరిక మేరకు ఏడాదికి ఒకసారి |
| కార్తీకమాస పరోక్ష అభిషేకం (నెల రోజులు) | ₹600 | కార్తీక మాసంలో ప్రతిరోజూ – మొదటి అభిషేకం |
Temple Contact Details:
బుకింగ్‌లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం లేదా సహాయం కోసం, మీరు ఆలయ అధికారులను సంప్రదించవచ్చు:
Temple Name: Sri Trikoteswara Swamy Temple
Address: Narasaraopet Mandal, Kotappakonda, Guntur District, Andhra Pradesh – 522601
Phone Numbers: 9849916173, 9908771463
Email ID: eo_kotappakonda@yahoo.in
Google Maps Location:
కోటప్పకొండ కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, అది భక్తుల పాలిట కల్పవల్లి, అభయమిచ్చే త్రికోటేశ్వరుడి నిలయం. ప్రకృతి ఒడిలో పరమశివుడు కొలువుదీరిన ఈ పవిత్ర క్షేత్రం, మానసిక ప్రశాంతతకు మరియు ఆధ్యాత్మిక చింతనకు మార్గం చూపుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకత్వానికి ప్రతీకగా నిలిచే ఈ కొండలు, శతాబ్దాల నాటి మన సంస్కృతికి మరియు భక్తి సంప్రదాయాలకు సజీవ సాక్ష్యాలు.
ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగే ప్రభల ఉత్సవం మరియు రథయాత్ర భక్తజన సందోహంతో కోటప్పకొండను కైలాసంగా మారుస్తాయి. భక్తితో కొలిచే వారికి ముక్తిని ప్రసాదించే ఆనందవల్లి సమేత త్రికోటేశ్వర స్వామిని ఒక్కసారైనా దర్శించుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిగా మిగిలిపోతుంది.
మీకు ఈ వ్యాసం నచ్చితే:
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
అమరావతి దేవాలయం ప్రక్కన కృష్ణానది ప్రవహించడానికి ఒక గొప్ప రహస్యం ఉంది తెలుసోవాలని ఉంటె ఇక్కడ చదవండి
📢 Join Our WhatsApp Channel here:




