Speciality of Ganagapur Dattatreya Temple || శ్రీ క్షేత్ర గాణగాపూర్:
గాణగాపూర్ కర్ణాటక రాష్ట్రంలోని కాలబురిగి(గుల్బర్గా) జిల్లాలో భీమా మరియు అమరజ నదుల సంగమ తీరాన వెలసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం గాణగాపూర్ దత్తక్షేత్రం. దత్తాత్రేయుని రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు సుమారు 20 ఏళ్ళ పాటు ఇక్కడ నివసించి, అనేక మహిమలు ప్రదర్శించి, భక్తులను అనుగ్రహించారు. నేటికీ స్వామి వారు ఇక్కడ అదృశ్య రూపంలో నివసిస్తున్నారని భక్తుల నమ్మకం.
గాణగాపూర్ బస్టాండ్ నుంచి నడిచి వెళితే దత్తక్షేత్రం దగ్గర్లో ఉంటుంది. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం. గాణగాపూర్కి గంధర్వపురం అని పేరు, గానుగాపురంలో దత్తాత్రేయుడు కర్మలను తొలగిస్తాడు (చేతబడి, దుష్టశక్తి ప్రభావం, మానసిక సమస్యలు, గొడవలు ఏ రకమైన సమస్యలైనా). అక్కడ గురు చరిత్ర పారాయణ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి, అన్నిటికీ నమ్మకం, విశ్వాసం ప్రధానం.
📢 Join Our WhatsApp Channel here:
గానుగాపురం “గురు” స్థానం. గురువు నడిచిన స్థానం కాబట్టి ఆ క్షేత్రంలో వీలైనంత వరకు చెప్పులు లేకుండా నడవాలి. స్వామి వారు ఇప్పటికీ ఈ ప్రదేశంలో తిరుగుతూ ఉంటారని చెప్తారు. అందుకే ఈ దేవాలయానికి అంత ప్రాముఖ్యత, ఈ దేవాలయానికి మానసిక రోగము, దుష్టశక్తులు ఆవహించిన వారు, రాహు కేతువుల దోషము, సర్పదోషము, ఏలి నాటి శని, అర్ధాష్టమ శని ఎటువంటి సమస్యలు అయినా కూడా ఏ దేవాలయానికి వస్తే నయమవుతాయని భక్తుల నమ్మకం.
![]()
Must Visit Places in Ganagapur Dattatreya Temple – ఈ క్షేత్రంలో తప్పక చూడాల్సిన మూడు ప్రదేశాలు:
- భీమా మరియు అమరజ సంగమం.
- నిర్గుణ మఠం పాదుకలు.
- శ్రీ కళ్ళేశ్వర మరియు శ్రీ శనీశ్వర మందిర్ (ముక్తిస్తాన్).
ఈ మూడు స్థానాలు దర్శిస్తేనే గానుగాపురం యాత్ర సంపూర్ణమవుతుంది.
ఈ దేవాలయంలో చాలామంది భక్తులు నిద్ర చేస్తారు, అక్కడ ఉండాల్సి వస్తే దేవాలయానికి సంబంధించిన మఠాలు ఉంటాయి, అందులో ఉండొచ్చు, లేదంటే ప్రైవేట్ రూమ్స్, లాడ్జి సదుపాయం కూడా కలదు. ఈ దేవాలయానికి పౌర్ణమి, అమావాస్య తిధుల్లో అనేకమంది భక్తులు దర్శనం చేస్తూ ఉంటారు, ఈ దేవాలయంలో సాయంత్రం పల్లకి సేవ కూడా జరుగుతూ ఉంటుంది, ఈ పల్లకి సేవలో భక్తులు కూడా పాల్గొనవచ్చును.ఈ పల్లకి సేవ సాయంత్రం గుడి లోపల చేస్తారు, పల్లకిని మూడుసార్లు తిప్పుతారు.
ఈ గుడిలో ఔదంబర వృక్షం ఉంటుంది, వృక్షం కింద నృసింహ సరస్వతి స్వామి కొన్ని సంవత్సరాలు ధ్యానం చేశారు, అందుకే ఈ వృక్షానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ వృక్షం కింద విభూది ఉంటుంది, ఈ వృక్షం కింద శ్రీమహావిష్ణువు స్వయంగా తపస్సు చేశారని చెప్తారు. దత్తాత్రేయని దర్శనం తర్వాత నిర్గుణ పాదుకలు దర్శనం చేసుకోవాలి, ఈ పాదాలను తాకి, మన యొక్క ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం.
ఈ క్షేత్రంలో గాలి సోకిన వారికి అంటే దుష్టశక్తి ప్రభావం ఉన్నవారికి దుష్ట శక్తులు వదిలిస్తారని నమ్ముతారు. ఈ క్షేత్రంలో కాశీ కుండ అని ఉంటుంది, బీమా అమర్జ సంగమానికి, నిర్గుణ మఠానికి, మధ్యలో ఉంటుంది సాక్షాత్తు ఆ “నృసింహ సరస్వతి” స్వామి వారు నీరు లేనప్పుడు కాశీలో ఉన్నటువంటి నీటిని అక్కడ సృష్టించారు. నృసింహ సరస్వతి స్వామి వారు అందులో స్నానం చేసేవారు, ప్రపంచంలో ఎక్కడ నీరు ఎండిపోయిన, ఈయన సృష్టించిన కాశీ కుండలో మాత్రం నీరు ఎండదు అని స్వామి చెప్పారంట, మండువేసవిలో బీమా నదిలో నీరు ఎండిపోయిన ఈ కాశీ కుండ అనే బావిలో నీరు అలాగే ఉంటుంది.
సాక్షాత్తు కాశీ విశ్వనాథుని విగ్రహాన్ని స్థాపించారు గురుదేవులు, జగద్గురు ఆదిశంకరాచార్యులు, శారదాంబ, నృసింహ సరస్వతి స్వామి వారి విగ్రహాలు ఒక ప్రైవేటు మఠం, శంకరమఠంలో ఉంటాయి.
భీమా మరియు అమరజ సంగమం:
ఇక్కడ భీమా మరియు అమరజా నదులు కలిసే ప్రదేశాన్ని భీమా అమరజ సంగమం అని పిలుస్తారు. గాణ్గాపూర్ యాత్రలో సంగమంలో స్నానం చేయడం ఎంతో పవిత్రమైన ఆచారం. సంగమ స్నానం చేసిన తర్వాత ఆలయ దర్శనం చేస్తే యాత్ర పూర్తి ఫలితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. భీమా మరియు అమరజ సంగమంలో సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, అక్కడ నృసింహ సరస్వతి వారి ఆలయం కూడా ఉంటుంది, దానిని “భక్తి స్థానం” అంటారు అందులో భక్తిని అంకురింప చేశాడు నృసింహ సరస్వతి స్వామి వారు.
సంగమ స్నానం చేయడానికి ఉత్తమ సమయం:
ఉదయం: 5:00 AM – 10:00 AM
సాయంత్రం: 4:00 PM – 6:00 PM
![]()
నిర్గుణ మఠం:
నిర్గుణ మఠాన్ని “కర్మ స్థానం” అంటారు అక్కడికి వెళ్లిన వారి కర్మలను తొలగిస్తాడు, అక్కడి కిటికీలో నుంచి నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు చూపిస్తారు, ప్రతిరోజు మధ్యాహ్నం గం1: 30 నిమిషాల వరకు మాత్రమే చూపిస్తారు, తరువాత పాదుకల దర్శనం ఉండదు. నిర్గుణ పాదుకలు దర్శనం కాకపోతే గానుగాపురం యాత్ర సంపూర్ణం కానట్టే అని శాస్త్రాలు చెప్తాయి.
![]()
అదే విధంగా దత్తాత్రేయ స్వామి వారు ఔదంబర వృక్షంలో ఆవహించి ఉన్నారు. అది “గురు స్థానం” అక్కడ అందరూ పారాయణ చేస్తూ ఉంటారు. నిర్గుణ మఠం నుంచి అర కిలోమీటర్ దూరంలో “కళేశ్వరం” అని ఉంటుంది. కల్లేశ్వరునికి పూజ చేస్తే శ్రీశైల మల్లికార్జునుడికి పూజ చేసినట్టే అని నృసింహ సరస్వతి వారు చెప్పారు. అక్కడ స్వయంభుగా ఉన్న శనీశ్వర ఆలయం ఉంటుంది, నవగ్రహాలు అన్ని ఉంటాయి.
ఔదంబర వృక్షం దగ్గర అందరూ గురుచరిత్ర పారాయణ చేస్తారు. సాక్షాత్తు స్వామి ఔదంబర వృక్షంలో ఎప్పుడు కొలువై ఉంటారు అని చెప్తారు. ఎటువంటి సమస్య ఉన్న, కోరిక ఉన్న 27 ప్రదక్షిణలు చేసి ఆ చెట్టును చూస్తూ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని చెప్తారు.
శ్రీ కళ్ళేశ్వర మరియు శ్రీ శనీశ్వర మందిర్ (ముక్తిస్తాన్):
శ్రీ కళ్ళేశ్వర ఆలయం భగవాన్ శివుడికి అంకితమైన పురాతన దేవాలయం. ఇది గాణ్గాపూర్ గ్రామంలోనే ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. భక్తులు ఇక్కడ శివలింగానికి అభిషేకం చేస్తారు. దత్తాత్రేయ స్వామి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఈ ఆలయంలో పూజలు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ శనీశ్వర మందిర్‌ను ముక్తిస్తాన్ అని కూడా పిలుస్తారు. ఇది శని గ్రహానికి అంకితమైన పవిత్ర స్థలం. శ్రీ శనీశ్వర మందిర్‌ను ముక్తిస్తాన్ అని కూడా పిలుస్తారు. ఇది శని గ్రహానికి అంకితమైన పవిత్ర స్థలం. చాలా మంది భక్తులు శని శాంతి కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. శనివారం రోజున భక్తులు ఎక్కువగా వస్తారు.
గానుగాపురంలో ఆరు అద్భుత ప్రదేశాలు:
1.విశ్రామకట్ట
2.సతి కట్ట
3.ఎండుకట్టె చిగురించిన ప్రదేశం
4.బ్రహ్మ రాక్షసుడి శాపవిమోచన ప్రదేశం
5.నాగేశ్వర దేవస్థానం
6.త్రివిక్రమ భారతి జీవ సమాధి
1.విశ్రామకట్ట:
నృసింహ సరస్వతి స్వామి వారు రోజు మఠం నుంచి సంగమానికి వెళ్లొచ్చే వారు, అలా వెళ్తుంటే దారిలో “పర్వతేషుడు” అనే రైతుకు చెందిన పొలం ఉండేది. స్వామి వెళ్తుంటే రోజు దారిలోనే, ఆ రైతు సాష్టాంగ నమస్కారం చేసి ఈయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి, ఆయన దర్శనం కలగడం అతని అదృష్టంగా భావించి, దూరం నుంచే నేలమీద సాష్టాంగ నమస్కారం చేసేవాడు.
స్వామి చూసి చిరునవ్వు నవ్వి వెళ్లిపోయేవారు, రోజు లాగానే ఒకరోజు సంగమానికి స్వామి వెళ్తుంటే, అతడు రోజు లాగే సాష్టాంగ నమస్కారం చేస్తుంటే, స్వామి చూసి “ఆయుష్మాన్‌భవ” అని దీవించి, ఏమిటి నాయనా రోజు నాకు సాష్టాంగం చేస్తావు? ఎవరు నువ్వు? అని అడుగుతారు. దానికి ఆ రైతు నా పేరు “పర్వతేషుడు”, మీరంటే అపారమైన భక్తి అని చెప్తాడు. దానికి స్వామి అయితే ఏంటి నీ కోరిక అని అడుగుతాడు, దానికి రైతు ఏమీ లేదు స్వామి, నా పొలం ఈ పక్కనే ఉంది, ఒకసారి మీరు వచ్చి నా పొలంలో అడుగు పెట్టండి, ఇప్పుడిప్పుడే నా పొలంలో కంకులు వస్తున్నాయి, మీరు అడుగుపెడితే జన్మ ధన్యమైనట్లే అని అడుగుతాడు.
దానికి స్వామి సరే అని, స్వామి ఆ పొలానికి వెళ్తారు, స్వామి పొలంలో అడిగిపెట్టి నేనంటే విశ్వాసమేనా? అని అడుగుతారు దానికి రైతు మీరు సాక్షాత్తు దత్తాత్రేయుడే, మీ మీద నాకు ఎనలేని విశ్వాసం అని చెప్తాడు.
అప్పుడు స్వామి ఆయన సంగమానికి వెళ్లొచ్చే లోపు పంట అంతా కోయించేయమని చెప్తారు, అలాగే స్వామి అని, ఆ రైతు నమస్కారం చేస్తే, నృసింహ సరస్వతి స్వామి వెళ్ళిపోతారు. స్వామి చెప్పినట్లు చేయాలని, ఇంటికి వెళ్లి అతని భార్యతో పంట కోయిస్తానని చెప్తాడు, దానికి ఆ రైతు భార్యా, పిల్లలు బాధపడి ఇప్పుడిప్పుడే కంకులు వస్తున్నాయి, కొన్ని రోజులు అయితే చాలా బాగా పండుతుంది.
ఇప్పుడు కోయించడం ఏమిటి? స్వామి చెప్పారు ఇప్పుడు కోయించమని అని, భార్య పిల్లలకు చెప్తాడు. ఆ స్వామికి తెలియదు అలా చేయొద్దు అని భార్యా పిల్లలు వాదించిన ఆ రైతు వినకుండా ఊర్లో వాళ్ళని పంట కోయడానికి పిలుస్తాడు. వాళ్ళు కూడా ఇప్పుడు కొయ్యోద్దని చెప్తారు. ఎవరు ఎన్ని చెప్పినా ఆ రైతు వినకుండా కోయించి అంతా పక్కకు పెట్టి ఉంచుతాడు.
ఈలోపు నృసింహ సరస్వతి స్వామి వారు సంగమం నుంచి వస్తూ ఉంటారు. ఆ రైతు స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. స్వామి ఏమి తెలియనట్టు అదేంటి నాయన నేను వెళ్లే అప్పుడు నీ పొలం అద్భుతంగా ఉండాలి? కదా అంటారు. దానికి రైతు స్వామి మీరు కోయించమన్నారు కదా కోయించాను అంటాడు, దానికి స్వామి నేను ఏదో సరదాగా చెప్పాను, నువ్వు నిజంగా అనుకున్నావా? అలా అయితే ఎలా అంటారు స్వామి, దానికి రైతు స్వామి మీ మాట మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, మీ మాట వేదవాక్కు, మీరు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులు మీరు చెప్పారు కాబట్టి చేశాను ఏమైనా పర్వాలేదు అంటాడు ఆ రైతు.
దానికి స్వామి చాలా సంతోషంతో నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది “నారాయణమస్తు” అని ఆశీర్వదించి మఠానికి వెళ్ళిపోతారు. ఇది జరిగిన ఒక వారానికే గానుగాపురంలో కుంభవృష్టి వర్షం, కొన్ని వారాలపాటు వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. ఊరంతా జలమయం అయిపోతుంది, పొలాలన్నీ మునిగిపోయి, కుళ్ళిపోతాయి. ఆ రైతు పొలంలో పంట ఏమీ లేదు కదా, ఆ వర్షం అంతా తగ్గి ఎండ వచ్చేసరికి ఆ కోసేసిన జొన్న మొదల నుంచి, మళ్లీ మొలకలు వచ్చి పెద్దగా పెరుగుతాయి. పెరిగి ఆ సంవత్సరం పొలం అద్భుతంగా పండుతుంది.
ప్రతి సంవత్సరం పండే దానికి 5, 6 రేట్లు ఎక్కువ పండుతుంది. అలా పండేసరికి ఆ రైతు, భార్య, పిల్లలు నృసింహ సరస్వతి స్వామి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి మీ గొప్ప తనం తెలియక తప్పుగా మాట్లాడాము క్షమించండి అని క్షమాపణ అడుగుతారు.
ఆ రైతు అంత ఎక్కువ పండిన, అతను ఇంట్లో దాచుకోకుండా తనకి కావాల్సినంత ఉంచుకొని మిగిలినది వర్షం వల్ల నష్టపోయిన వారందరికీ దానం చేస్తాడు. అలాంటి ఉన్నతమైన బుద్ధి ఉంటే నృసింహ సరస్వతి స్వామి వారి కంటపడతారు. ఆ పొలం ఇప్పటికీ గానుగాపురంలో ఉంది. అది ఎక్కడ ఉంది అంటే, అష్ట తీర్థాలలో, వారణాసి తీర్థానికి ఎదురుగా ఒక చిన్న దేవాలయం కనిపిస్తుంది. ఆ దేవాలయానికి పక్కన ఉన్న పొలమే ఆ పర్వతేషుని పొలం, నృసింహ సరస్వతి స్వామి అడుగుపెట్టిన పొలం.
2.సతికట్ట:
మాహుర్ లో ఒక జంట ఉండేవారు, వారు వివాహం అయ్యాక చాలా అన్యోన్యంగా ఉండేవారు. కొంతకాలం అయ్యేసరికి అతనికి ఘోరమైన జబ్బు చేసింది. అతను మృత్యువు వరకు వెళ్ళిపోతాడు, వైద్యులు కూడా ఇతను కొంతకాలంలో చనిపోతారు, ఎవరు రక్షించలేరు అని చెప్తారు. అప్పుడు అతని తల్లిదండ్రులు అతని భార్యతో ఇలా చెప్తారు “కోడలా నీ భర్తని రక్షించడం ఒక దత్తాత్రేయుని వలన మాత్రమే సాధ్యమవుతుంది.
ఆయన గానుగాపురంలో కర, చరనాధులతో తిరుగుతూ ఉంటారు, “నృసింహ సరస్వతి స్వామి” అవతారంలో, నువ్వు అక్కడికి తీసుకెళ్తే నా కొడుకు రక్షించబడతాడు” అని చెప్తారు. దానికి ఆవిడ నా భర్త బతకడం కన్నా ఇంకేమి కావాలి? నా సౌభాగ్యం నిలబడడానికి ఏమైనా చేస్తాను, తప్పకుండా తీసుకెళ్తాను అని అంటుంది.
అలా చెప్పి ఆమె భర్తని పల్లకిలో కూర్చోబెట్టుకుని మాహుర్ నుంచి గానుగాపురం వరకు తీసుకొస్తుంది. ఆవిడ మఠం చేరేసరికి స్వామి లేరు సంగమానికి వెళ్లారు అని చెప్తారు. అంత దూరం ప్రయాణం చేయటం వల్ల ప్రయాణ బడలిక వల్ల వ్యాధి విపరీతమైపోతుంది, సరే అయితే సంగమానికి తీసుకువెళ్దాం అని వెళ్తుంటే పక్కకి వెళ్ళగానే అతడు మరణిస్తాడు. ఆవిడ బోరున ఏడుస్తూ ఉంటుంది, దాంతో చుట్టూ ఉన్న వాళ్ళు అంతా నీకు నృసింహ సరస్వతి స్వామిని చూసే అదృష్టం లేదు, ఇంకా ఏం చేస్తాం, ఇక్కడే దహన కార్యక్రమాలు పూర్తి చేయమని చెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తారు.
దానికి ఆవిడ నా భర్త లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి “సహాగమనం” చేస్తాను అని చెప్తుంది. మా అత్తమామలకు ఈ వార్త తెలియజేయండి అని చెప్పి సిద్ధమవుతుంది. ఆలోపు ఒక సాధువు వచ్చి ఎలాగో ఇంతవరకు వచ్చావు కదా నృసింహ సరస్వతి స్వామిని దర్శనం చేసుకుని సహాగమనం చేయి అని చెప్తాడు.
దానికి ఆవిడ సరే అని వెళ్తూ ఉంటే స్వామి సంగమం నుంచి మఠానికి తిరిగి వస్తూ ఉంటారు. అక్కడ ఒక ప్రదేశంలో ఆవిడ స్వామి పాదాల మీద పడి బోరున ఏడుస్తూ ఉంటుంది. దానికి స్వామి ఎందుకు తల్లి ఏడుస్తున్నావు “అఖండ సౌభాగ్యవతిభవ” అని ఆశీర్వదిస్తారు. అలా ఆశీర్వదించేసరికి చుట్టుపక్కల ఉన్నవారు నవ్వి ఆ దూరాన చితి మీద ఉంది ఆమె భర్త అని చెప్తారు.
దానికి నృసింహ సరస్వతి స్వామి అవునా అయితే వెళ్దాం పదండి అని అక్కడికి వెళ్లి కమండలంలో నీళ్లు తీసి ఒక్కసారి చల్లగానే లేచి కూర్చుంటాడు ఆ చనిపోయిన అతను. అది స్వామి మహిమ. ఈ సంఘటన జరిగిన ప్రదేశాన్ని “సతికట్ట” అని “సౌభాగ్యదాన క్షేత్రం” అని పిలుస్తారు. అక్కడికి వెళ్లి ఎవరైనా స్త్రీలు గురు చరిత్ర పారాయణ చేస్తే వాళ్ళ సౌభాగ్యం అఖండంగా నిలబడుతుందని నమ్మకం. ఈ ప్రదేశం గానుగాపురం మఠానికి చాలా దగ్గరగా ఉంటుంది. 5నిమిషాలు సమయం పడుతుంది.
3.ఎండు కట్టే చిగురించిన ప్రదేశం:
నరహరి శర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, అతనికి ఒళ్లంతా తెల్ల కుష్టురోగం వస్తుంది. భార్య వదిలేసి వెళ్ళిపోతుంది, ఊర్లో వాళ్లంతా అసహ్యించుకోవడం మొదలు పెడతారు. అప్పుడు నృసింహ సరస్వతి స్వామి వారి గురించి విని ఆయన రక్షిస్తాడని గంపెడు ఆశతో గానుగాపురం వస్తాడు. వచ్చేసరికి స్వామి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. ఆ పక్కనే చేతులు కట్టుకొని నిలబడతాడు ఎంతసేపైనా స్వామి చూడరు. అందరూ అసహ్యించుకుంటూ ఉంటారు. చివరికి స్వామి ఎవరు నాయనా నువ్వు? ఏమి కావాలి? అని అడుగుతారు.
స్వామి నాకు కుష్టు రోగం వచ్చింది, మీరు రక్షిస్తారని నమ్మకంతో వచ్చాను అని అంటాడు. దానికి స్వామి అవునా అంత నమ్మకం ఉందా అని అంటారు. అప్పుడు దారిలో ఒక అతను కట్టెల మోపు తీసుకెళ్తూ ఉంటాడు, అతనిని పిలుస్తారు, అతడు ఏమిటి స్వామి అని అడుగుతాడు? దానికి స్వామి ఆ కట్టెల మోపులో నుంచి బాగా ఎండిపోయిన ఒక కట్టె ఒకటి తీసి ఇవ్వు అని స్వామి అంటారు, బాగా ఎండిపోయిన కట్టే ఒకటి తీసి ఇస్తాడు. స్వామి ఆ కట్టే తీసుకొని నరహరి శర్మ వైపుకు తిరిగి “నాయన నా మీద విశ్వాసం ఉంది అన్నావు కదా! ఈ కట్టే తీసుకెళ్లి సంగమంలో ఉన్న అశ్వద్ధ వృక్షం దగ్గర పాతి, రోజు 108 బిందెల నీరు పోయి ఇది చిగురించే సమయానికి నీకు కుష్టు రోగం తగ్గిపోతుంది” అని చెప్తారు.
దానికి బ్రాహ్మణుడు మహా ప్రసాదం అని తీసుకెళ్లి స్వామి చెప్పినట్లే పాతి, నీళ్లు పోయడం మొదలు పెడతాడు. రోజు 108 బిందెలు అంటే చాలా కష్టమైన, విశ్వాసంతో చేసాడు. అప్పుడు చాలామంది భక్తులు స్వామి దగ్గరికి వచ్చి, ఏంటి స్వామి? ఆ బ్రాహ్మణుడికి అలా చెప్పారు నీళ్లు పోయమని, అతడు అలాగే చేస్తున్నాడు. ఎండుకట్టే నీళ్ళు పోస్తే చిగురిస్తుందా? ఒకవేళ మీరు తగ్గించలేకపోతే తగ్గించను అని చెప్పవచ్చు కదా? ఎందుకు అతనికి ఆశ పెట్టడం అంటారు, దానికి స్వామి అతను పోసే నీటికి చిగురించదు, అతని విశ్వాసానికి చిగురుస్తుంది. ఎలా చిగురుస్తుందో చూపిస్తాను. పదండి అని సంగమానికి వెళ్తారు.
వెళ్లేసరికి అతను నీళ్లు పోస్తూ ఉంటాడు, స్వామి చూసి చిరునవ్వు నవ్వి నీ కర్మ తీరిపోయింది అని, కమండలంలో నుంచి నీళ్లు తీసి ఆ కట్టే మీద జల్లుతారు. అలా జల్లగానే ఆ కట్టే ఔదంబర వృక్షం అయిపోతుంది. ఆ బ్రాహ్మణుడు స్వామిని చూసి, స్వామి పాదాల మీద పడి నీళ్ళు పోస్తున్నాను స్వామి అని చెప్తాడు. దానికి స్వామి ఇక పొయ్యినక్కర్లేదు నాయనా అంటారు, ఎందుకు స్వామి అని అడిగితే? నీ ఒళ్ళు చూసుకో అంటారు, చూసుకుంటే ఎక్కడా కుష్టు రోగం ఉండదు. ఒళ్లంతా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటుంది.
అప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఆనందం వచ్చి స్వామిని స్తోత్రం చేస్తాడు. ఆ వృక్షం ఎక్కడ ఉంది అంటే సంగమంలో ప్రదక్షణ చేసి పారాయణ చేస్తూ ఉంటాం కదా, అక్కడ ఇదివరకు అశ్వద్ధ వృక్షం ఉండేది, ఆ పక్కనే ఔదంబర వృక్షాన్ని పాతారు, అది కొంతకాలానికి వెళ్ళిపోయింది, కానీ దాని తర్వాత పాతిన వృక్షాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి.
4.బ్రహ్మ రాక్షసుడి శాప విమోచన ప్రదేశం:
ఒకసారి నృసింహ సరస్వతి స్వామి సంగమం నుంచి గానుగాపురం మఠానికి మకాం మారుస్తూ ఉంటారు, ఒక రాజు వేడుకొని, పల్లకిలో స్వామిని తీసుకొస్తాడు, అప్పుడు ఒక చోటికి వచ్చేసరికి ఆ ప్రదేశం అంతా పాడుబడిపోయి ఉంటుంది. ఏమిటి ఇలా ఉంది అని అడుగుతారు స్వామి? దానికి రాజు, స్వామి ఇక్కడ ఒక బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళని చంపేస్తున్నాడు, అందుకని ఇక్కడ ఎవరూ ఉండరు స్వామి, ఇది నివాసయోగ్యమైన ప్రదేశం కాదు అని చెప్తాడు రాజు.
దానికి స్వామి మాకు ఇదే నివాసయోగ్యమైన ప్రదేశం, ఈ మఠంలోనే నేను ఉంటాను అని, ఆ పాడుబడిన మఠం చూపించి అక్కడికి తీసుకు వెళ్ళమని చెప్తారు. అక్కడికి వెళ్తుంటే, ఆ పక్కనే ఒక వృక్షం ఉంటుంది, దాని పైకి ఒకసారి చూస్తారు స్వామి, చూడగానే వీళ్ళకి ఎవరికీ కనిపించడు కానీ ఆ బ్రహ్మ రాక్షసుడు, స్వామికి కనిపిస్తాడు. ఆ బ్రహ్మ రాక్షసుడు పిశాచత్వంతో వచ్చి అక్కడ ఏడుస్తూ నిలబడతాడు.
అప్పుడు స్వామి అనుగ్రహించి బాధపడకు నాయనా, నీ పాపం ఏంటో నాకు తెలుసు, నీకు శాప విమోచన కలిగిస్తున్నాను, ఇంతకన్నా ఉత్తమమైన జన్మను పొందుతావు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటారు స్వామి. అతను వెళ్ళిపోతాడు ఆ ప్రదేశం గానుగాపురం మఠంలోనే ఉంది. దర్శనానికి వెళ్లి ఒక ద్వారం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎదురుగా దిమ్మ మీద ఉండే వృక్షమే ఆ బ్రహ్మ రాక్షసుడికి విమోచన కలిగించిన వృక్షము. దుష్టశక్తి ఆవహించిన వారిని ఈ చెట్టు వద్దకు తీసుకొస్తే వారికి వెంటనే ఆ దుష్ట శక్తి వదిలిపోతుంది.
5.నాగేశ్వర దేవస్థానం:
నృసింహ సరస్వతీ స్వామికి “సాయందేవుడు” అని ఒక మహా భక్తుడు ఉండేవాడు. ఒకరోజు అతడు స్వామి సంగమం దగ్గరికి వెళ్లేసరికి చీకటి పడుతుంది, ఈలోపు కుంభవృష్టి వర్షం మొదలవుతుంది, ఉరుములు మెరుపులతో చాలా పెద్ద వర్షం అంటే కాసేపటికి మోకాల్లోతు నీళ్లు వచ్చేంత వర్షం కురుస్తుంది, అంత పెద్ద వర్షం పడుతూ ఉంటుంది, అతన్ని పరీక్షించడానికి స్వామి అంటారు, నాయనా “నాకు బాగా చలేస్తుంది మఠానికి వెళ్లి, కుంపటి, మంట తీసుకొస్తావా అంటారు” దానికి అతడు ఏమీ తిరిగి మాట్లాడకుండా, అలాగే స్వామి అని వెళ్తాడు.
దానికి స్వామి త్వరగా వచ్చేసేయ్ నాకు బాగా చలేస్తుంది, కానీ దారిలో వెనక్కి తిరిగి చూడకు అని అంటారు. సరే స్వామి అని మఠానికి వెళ్తాడు. కటిక చీకటి, మోకాల్లోతు నీళ్లు, పైనుండి కుండపోత వర్షం, దారి కనిపించదు, అయినా అలాగే వెళ్లి అక్కడ ఉన్న కుంపటిని తీసుకొని వస్తూ ఉంటాడు, వస్తుంటే అతనికి స్వామి చెప్పింది గుర్తొస్తుంది స్వామి నన్ను వెనక్కి తిరిగి చూడొద్దన్నారు కదా! ఏముంది వెనకాల అని వెనక్కి తిరిగి చూసేసరికి రెండు మహాసర్పాలు కనిపిస్తాయి, అంతే భయపడి పరిగెత్తుకుంటూ వెళ్తాడు సంగమానికి, ఒకచోటికి వెళ్లేసరికి బాగా భయం వేసి స్వామి మీరే కాపాడాలి! ఈ పాములు తరుముతున్నాయి అని భయపడతాడు.
అలా భయపడి చూసేసరికి వర్షం ఉండదు, ఏమీ ఉండదు, సంగమం దగ్గర వెన్నెల కురుస్తూ అక్కడ సహస్ర దీపాల మధ్యలో “నృసింహ సరస్వతి స్వామి” ప్రశాంతంగా కూర్చుని జపం చేసుకుంటూ ఉంటారు. అది చూసి వెళ్లి స్వామి పాదాల మీద పడి, స్వామి నన్ను తరమడానికి రెండు మహాసర్పాలు వచ్చాయి అని చెప్తాడు. దానికి స్వామి ఏమి బాధపడకు నాయనా నిన్ను రక్షించడానికి నేనే పంపించాను అని చెప్తారు స్వామి.
ఆ సర్పాలు సాయం దేవుడికి కనిపించిన చోట ఇప్పుడు “నాగనాథ” ఆలయం ఉంది. అష్ట తీర్థాలకు వెళుతుంటే ఒకచోట, పక్కన ఒక సందులోకి వెళ్లాలి అక్కడ ఉంటుంది ఈ ఆలయం. సాయం దేవుడికి ఉన్న అపారమైన భక్తితో తన కుమారుడికి “నాగనాధుడు” అని పేరు పెట్టుకుంటాడు.
6.త్రివిక్రమ భారతి జీవ సమాధి:
ఇది కచ్చితంగా చూసి తీరాల్సిన గొప్ప ప్రదేశం. ఈ త్రివిక్రమ భారతి ఎవరు అంటే, గానుగపురానికి 30 కిలోమీటర్ల దూరంలో “కుమసి” అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడ ఉండే మహాకవి గొప్ప నృసింహ ఉపవాసకుడు. ఆయన ప్రతిరోజు ధ్యానంలో కూర్చుంటే ” నృసింహ స్వామి” మనో నేత్రానికి కనిపిస్తే, నృసింహ స్తుతి చేసేవాడు ప్రతిరోజు. ఒకరోజు నృసింహ సరస్వతి స్వామిని చూసి “ఏమిటో, ఈ దత్తావతారాలు అని చెప్పుకొని ఊరికే పల్లకీలలో ఊరేగుతూ ఉంటారు, ఇంత డాంబికం ఉంటే ఈయన సన్యాసి ఏమిటి” అని అంటూ ఉండేవాడు.
అలాగే నృసింహ సరస్వతి స్వామిని ఎక్కడపడితే అక్కడ దూషిస్తూ ఉంటాడు. చివరికి ఒక రోజు స్వామి పల్లకిలో వెళ్తూ, కుమసి గ్రామానికి వెళ్దాం అంటారు, అంటే చుట్టూ ఉన్నవాళ్లు అంటారు అక్కడ త్రివిక్రమ్ భారతి ఉన్నాడు, అతను మిమ్మల్ని దూషిస్తూ ఉంటాడు, అంటారు. దానికి స్వామి ఏమి పర్వాలేదు పదండి అంటారు.
ఈ లోపు త్రివిక్రమ భారతి నృసింహ ఉపాసన చేస్తుంటే, నృసింహ సరస్వతి స్వామి ఆరోజు మనో నేత్రానికి కనిపించరు, అదేమిటి స్వామి కనిపించట్లేదు అని, ఎంత ప్రయత్నం చేసినా ధ్యానం కుదరదు, అప్పుడు ఏడుస్తుంటే నృసింహ సరస్వతి స్వామి అంటారు, ఇక్కడ ఏం చూస్తావు? ఆ నది ఒడ్డున నేనే శశరీరంగా వచ్చాను, వెళ్లి చూడు అంటారు.
స్వామి రావడం ఏమిటి? అని వెళ్లి చూస్తే అక్కడ నృసింహ సరస్వతి స్వామి కూర్చొని ఉంటారు, త్రివిక్రమ భారతి, ఈ సన్యాసా? అని అనుకుంటూ ఉంటే, సమయానికి విచిత్రంగా ఏమి జరుగుతుంది అంటే? స్వామి పల్లకి, పల్లకి మోసే వారు, ఆయనతో వచ్చిన పరివారం, భక్తులు, అందరూ నృసింహ సరస్వతి స్వామి రూపంలో కనిపిస్తారు, దానితో అతనికి ఏమీ అర్థం కాదు, ఎవరు స్వామి? ఎవరు స్వామి కాదు? అని.
అప్పుడు ఏడ్చి మోకాళ్ళ మీద కూర్చొని స్వామి నన్ను రక్షించు, నా అజ్ఞానాన్ని మన్నించు, నువ్వు సర్వాంతర్యామివి అంతటా ఉన్నావు. అలాంటి నిన్ను పల్లకి ఎక్కావు, వీళ్లు మోస్తున్నారు, అని నోటుకి వచ్చినట్లు మాట్లాడాను స్వామి. ఈ పల్లకి నువ్వే.. మోసే వాళ్లు నువ్వే.. వాళ్ళ శక్తి నువ్వే.. నన్ను రక్షించు.. నన్ను క్షమించు.. విశ్వరూపం అంటే ఏమిటో తెలిసింది! అని పాదాల మీద పడితే, అప్పుడు స్వామి అనుగ్రహిస్తారు. ఆ ప్రదేశాన్ని “విశ్వరూప దర్శన ప్రదేశం” అంటారు.
ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అంటే గానుగాపురం రావాలంటే అఫ్జల్పూర్ అనే ఊరు రావాలి, అఫ్జల్పూర్ నుండి 15 కిలోమీటర్ల దూరం, అక్కడ ఉంటుంది “కుమసి” అనే గ్రామం. అక్కడ చూడవలసిన ప్రదేశాలు 2 ఉన్నాయి. విశ్వరూపం దర్శనం ఇచ్చిన ప్రదేశము, అక్కడ ఇప్పుడు ఒక చిన్న ఆలయం కట్టి స్వామి పాదుకలు ఉంచారు. రెండోది త్రివిక్రమ భారతి జీవ సమాధి ఉంది. గానుగాపురం వెళ్ళినప్పుడు ఇవి కూడా దర్శించుకోవచ్చు.
కుదిరితే గురు చరిత్రలో వాటికి సంబంధించిన అధ్యాయాలు చదువుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గాణ్గాపూర్ ఆలయ రోజువారీ పూజల సమయాలు:
| సమయం | కార్యక్రమం | వివరాలు |
|---|---|---|
| 2:30 AM – 3:00 AM | కకడ్ ఆరతి మరియు దర్శనం ప్రారంభం | ఈ సమయంలో స్వామివారికి కకడ్ ఆరతి జరుగుతుంది. భక్తులకు దర్శనం ప్రారంభమవుతుంది. |
| 3:00 AM – 5:00 AM | లఘున్యాస పూర్వక పూజలు | సౌర మంత్రం, గణపతి అతర్వశీర్షం, పురుషసూక్తం మంత్రాలతో పూజలు చేస్తారు. శాలగ్రామం మరియు గురు స్ఫటికలింగానికి లఘు రుద్రాభిషేకం నిర్వహిస్తారు. |
| 5:00 AM – 6:00 AM | నిర్గుణ పాదుకలకు కేశర లేపనం మరియు మహాపూజ | ఆలయ పూజారులు నిర్గుణ పాదుకలకు కేశర లేపనం చేసి పాదుకా పూజ మరియు చింతామణి గణపతి పూజ నిర్వహిస్తారు. |
| 6:00 AM – 6:30 AM | గురు ఆరతి / పాదుకా ఆరతి | దత్తాత్రేయ స్వామివారి పాదుకలకు మొదటి ఆరతి నిర్వహిస్తారు. |
| 6:30 AM – 7:00 AM | తీర్థం మరియు పంచామృతం పంపిణీ | భక్తులకు తీర్థం మరియు పంచామృతం ప్రసాదంగా ఇస్తారు. |
| 7:00 AM – 11:30 AM | భక్తుల అభిషేకాలు మరియు పూజలు | రుద్రాభిషేకం, లఘు రుద్రాభిషేకం, సువర్ణ పాదుకలకు పూజ, స్ఫటిక లింగానికి పాలు అభిషేకం మరియు నిర్గుణ పాదుకలకు పూజలు జరుగుతాయి. సాధారణ దర్శనం కూడా ఉంటుంది. |
| 11:30 AM – 12:30 PM | మహా మంగళారతి మరియు మహా నైవేద్యం | మహా మంగళారతి (రెండవ ఆరతి), మహా నైవేద్యం సమర్పణ మరియు అన్నదానం (మాధుకరి / భిక్ష సేవ) జరుగుతుంది. |
| సమయం | కార్యక్రమం | వివరాలు |
|---|---|---|
| 12:30 PM – 2:00 PM | సువర్ణ పాదుకలకు భక్తుల పూజ | ఈ సమయంలో భక్తులు సువర్ణ పాదుకలకు పూజ చేయడం కొనసాగుతుంది. |
| 2:00 PM – 2:30 PM | నిర్గుణ పాదుకలకు పూజ | ఆలయ పూజారులు నిర్గుణ పాదుకలకు పూజ మరియు చింతామణి గణపతి పూజ నిర్వహిస్తారు. అనంతరం ఆ రోజు కోసం పాదుకలను మూసివేస్తారు. |
| 2:30 PM – 7:30 PM | సాధారణ దర్శనం | ఈ సమయంలో భక్తులకు సాధారణ దర్శనం కొనసాగుతుంది. |
| 7:30 PM – 8:15 PM | మహా మంగళారతి మరియు మంత్ర జాగరణ | పూజారులు వేద పఠనం చేస్తూ మహా మంగళారతి నిర్వహిస్తారు. ఇది రోజులో మూడవ ఆరతి. |
| 8:15 PM – 8:45 PM | పల్లకీ సేవ | స్వామివారి విగ్రహాన్ని పల్లకీ లో ఉంచి భజనలు మరియు ఆరతులతో ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు. |
| 9:00 PM – 9:30 PM | శేజ ఆరతి | స్వామివారికి శేజ ఆరతి చేసి స్తోత్రాలు చదివి ఆ రోజు ఆలయాన్ని మూసివేస్తారు. |
గమనిక: పై పేర్కొన్న సమయాలు పండుగలు, పౌర్ణమి, అమావాస్య, జాతీయ సెలవులు లేదా ఎక్కువ మంది భక్తులు వచ్చిన రోజులలో సుమారు 30 నిమిషాల వరకు మారే అవకాశం ఉంటుంది.
Ganagapur Dattatreya Temple Google Maps Location:
FAQs of Ganagapur Dattatreya Temple:
1. గాణ్గాపూర్ దత్త క్షేత్రం ఎక్కడ ఉంది?
గాణ్గాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని కాలబురిగి జిల్లాలో గాణ్గాపూర్ గ్రామంలో ఉంది. ఇది దత్తాత్రేయ స్వామి యొక్క అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటి.
2. గాణ్గాపూర్ ఆలయ దర్శన సమయాలు ఏమిటి?
గాణ్గాపూర్ దత్త ఆలయం సాధారణంగా ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనానికి అందుబాటులో ఉంటుంది.
3. గాణ్గాపూర్ సంగమం ఎందుకు ప్రసిద్ధి?
భీమా మరియు అమరజా నదులు (Bhima Amaraja Sangam) కలిసే ఈ సంగమంలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ స్నానం పాపాలను తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు.
4. గాణ్గాపూర్ యాత్రలో ముందుగా ఏమి చేయాలి?
గాణ్గాపూర్ యాత్రలో ముందుగా సంగమంలో స్నానం చేసి, తరువాత దత్తాత్రేయ స్వామి ఆలయంలో దర్శనం చేయడం సంప్రదాయం.
5. గాణ్గాపూర్ ఆలయంలో ఏ దేవుడు ఉన్నారు?
ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామి పవిత్ర పాదుకలను భక్తులు దర్శించుకుంటారు.
6. గాణ్గాపూర్ వెళ్లడానికి ఉత్తమ సమయం ఏది?
గాణ్గాపూర్ దర్శనానికి అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు కాలం ఉత్తమంగా ఉంటుంది. గురువారం రోజున ఎక్కువ మంది భక్తులు వస్తారు.
7. గాణ్గాపూర్ దగ్గర చూడాల్సిన ప్రదేశాలు ఏమిటి?
గాణ్గాపూర్ యాత్రలో భక్తులు ఈ ప్రదేశాలను దర్శిస్తారు:
Bhima Amaraja Sangam (భీమా అమరజ సంగం)
Nirguna Paduka Temple (నిర్గుణ పాదుక టెంపుల్)
Kalleshwar and Saneeshwar Temple (కల్లేశ్వర్ & శనీశ్వర టెంపుల్)
8. గాణ్గాపూర్ దత్త క్షేత్రం ఎందుకు ప్రత్యేకం?
గాణ్గాపూర్ దత్త క్షేత్రం దత్తాత్రేయ స్వామి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి తపస్సు చేసిన పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది.
Also Read: శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి అనుగ్రహం పొందే అద్భుత పూజ
గమనిక: ఈ సమాచారం భక్తుల విశ్వాసం మరియు ధార్మిక గ్రంథాల ఆధారంగా సేకరించబడింది. ఆలయ సమయాలు మరియు పూజా వివరాలలో మార్పులు ఉండవచ్చు, కాబట్టి ప్రయాణానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి తనిఖీ చేయగలరు.
మీకు ఈ వ్యాసం నచ్చితే:
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
📢 Join Our WhatsApp Channel here:


