Maha Shivaratri 2026(మహా శివరాత్రి 2026):
శివనామ స్మరణతో మారుమోగిపోయే పర్వదినం మహా శివరాత్రి. హిందువులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ, కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. అది ఆత్మ పరమాత్మలో లీనమయ్యే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. సృష్టికర్త అయిన పరమశివుడు లింగోద్భవ రూపంలో దర్శనమిచ్చిన రోజూ, శక్తి స్వరూపిణి అయిన పార్వతీ దేవితో జగద్గురువు కళ్యాణం జరిగిన రోజూ ఈ రోజే!
శివనామ స్మరణతో పునీతమయ్యే పవిత్ర పర్వదినం – Maha Shivaratri 2026:
2026 సంవత్సరంలో ఈ మహత్తర పర్వదినం ఫిబ్రవరి 15, ఆదివారం నాడు వస్తోంది. మాఘ మాస బహుళ చతుర్దశి నాడు వచ్చే ఈ పవిత్ర రాత్రి, భక్తులకు కైలాసనాథుని అనుగ్రహాన్ని పొందే అద్భుతమైన అవకాశం. రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ మరియు ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్ర జపంతో భక్తులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకుని, మోక్ష మార్గంలో పయనిస్తారు.
📢 Join Our WhatsApp Channel here:
ఈ ఆర్టికల్లో మనం 2026 మహా శివరాత్రి తిథి (Maha Shivaratri 2026 Date and Time Telugu), పూజా ముహూర్తాలు, విశిష్టత మరియు ఉపవాస నియమాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం.
మహాశివరాత్రి, మాసశివరాత్రి అని రెండు ఉంటాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. కాని ఒక్క మాఘ మాసంలో వచ్చే అమావాస్య ముందు వచ్చే చతుర్దశి అర్థరాత్రి వరకు ఉంటే దానిని మహాశివరాత్రి అంటారు. ఇవి రెండు రాత్రి సంబంధంగా ఉంటాయి, రాత్రి అంటే చీకటికి సంకేతం. అర్ధరాత్రి అంటే కఠిక చీకటికి సంకేతం. సంవత్సరం మొత్తం మీద అర్ధరాత్రి భగవంతుడు ఆవిర్భవించేటటువంటి తిథులు రెండు వస్తాయి. శ్రావణమాసంలో బహుళపక్షంలో అష్టమి తిధి నాటి రాత్రి “కృష్ణ పరమాత్మ” అవతార స్వీకారం.
తర్వాత శ్రావణమాసం నుంచి 6 నెలల తర్వాత మాఘ మాసంలో బహుళ పక్షంలో అమావాస్య తిధికి ముందు వచ్చే చతుర్దశి అర్ధరాత్రి వేళ లింగోద్భవం(జ్యోతిర్లింగం)జరుగుతుంది. ఈ జోతిర్లింగం పుట్టినటువంటి కాలాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగం అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఈ శివరాత్రి రోజు ప్రధానంగా ఉపవాసం, జాగరణ చేస్తారు. ఉపవాసము అంటే ‘ఉప’ అంటే సమీపము, ‘వాసము’ అంటే ఉండుట, భగవంతునికి సమీపము నందు ఉండుట అని అర్ధం, పంచేంద్రియాలను, కర్మేంద్రియాలను భగవంతునికి సమీపముగా ఉంచాలి.

“జన్మానికి ఒక శివరాత్రి అని చెప్తారు” మహాశివరాత్రి రోజు చేసే ఉపాసన కొన్ని కోట్ల జన్మలకి సరిపడినంత అనుగ్రహాన్ని ఈశ్వరుడు ఇచ్చే కాలం. ఎవరి శక్తి కొలది వారు ఏది చేసినా ఆ రోజు శివానుగ్రహం కలుగుతుంది.
మహాశివరాత్రి 2026 తేదీ, సమయం (Maha Shivaratri 2026 Date and Time):
ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 05:05PMకు ప్రారంభమైవుతుంది. 16వ తేదీ సాయంత్రం 05:34 ని||లకు ముగుస్తుంది. కాబట్టి మహాశివరాత్రిని ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజు జరుపుకోవాలి. ఎందుకంటే మహాశివరాత్రి పూజకు అత్యంత పవిత్రమైన సమయం నిషిత కాలం (అర్ధరాత్రి సమయం). ఆ రోజు నిషిత కాల పూజకు ముహుర్తం (ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 11:55PM నుంచి 12:56AM వరకు ఉంటుంది).
Maha Shivaratri 2026 – శివరాత్రి రోజు చేయాల్సిన పనులు:
- అభిషేకం,
- బిల్వదళాలతో అర్చన,
- శివనామస్మరణ,
- అర్చన,
- ఉపవాసం,
- జాగరణ.
వీటిలో ఏది చేయటానికి కుదరకపోయినా కనీసం శివనామ స్మరణ చేసిన విశేషమైన ఫలితం వస్తుంది. శివరాత్రి రోజు శివలింగానికి చేసిన అభిషేకం పరమాద్భుతమైన పుణ్యం వస్తుంది. నమక, చమకంతో అంటే వేదం వస్తే అభిషేకం చేసుకోవచ్చు. వేదం రాకపోతే తప్పులు చదవరాదు. శివరాత్రి రోజు సాయంత్రం 06:00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటలు అంటే సూర్యోదయం ముందు వరకు ఉన్న కాలం చాలా పవిత్రమైనది.
ఈ సమయంలో 04 జాములు ఉంటాయి. ఒక జాము అంటే 03 గంటలు, అర్ధరాత్రి 12:00 గంటలకు లింగోద్భవకాలం చాలా పవిత్రమైనది. కుదిరితే ఆ సమయం వరకు ఉండి అప్పుడు అభిషేకం చేస్తే మంచిది. కనీసం 05 నిముషాలు అభిషేకం చేసిన మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలా 11 సార్లు అభిషేకం చేయాలి. 11 సార్లు కుదరక పోతే 05సార్లు, లేకపోతే 03 సార్లు, లేదా కనీసం ఒక్కసారి అయిన అభిషేకం చేయాలి. ప్రతి జాములోను ఒక సారి అభిషేకం చేయవచ్చు. (సాయంత్రం 06:00PM, 09:00PM, 12:00AM(అర్థరాత్రి), 03:00AM, 06:00AM).
మహాశివరాత్రి విశిష్టత: బోయవాడి కథ – మోక్ష మార్గం నేపథ్యం:
ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుడిని ఒక సందేహం అడిగింది: “నాథా! మానవులు తమ అజ్ఞానం వల్ల, తెలియక చేసే పాపాల వల్ల మళ్లీ మళ్లీ జన్మిస్తూ సంసార సాగరంలో చిక్కుకుపోతున్నారు. వారు తమ పాపాల నుండి విముక్తి పొంది, పుణ్యమార్గంలో పయనించి, కైలాసాన్ని చేరుకోవడానికి ఏదైనా సులభమైన మార్గం ఉందా?” అని ప్రశ్నించింది. అప్పుడు దయామయుడైన శివుడు చిరునవ్వుతో, “పార్వతీ! మహాశివరాత్రి వ్రతం మనిషిని పాప విముక్తుడిని చేస్తుంది. దీనికి ఉదాహరణగా ఈ బోయవాడి కథ విను” అని చెప్పడం ప్రారంభించాడు.
అడవిలో వేట – శివలింగం: పూర్వం ఒక అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు. అతడు వేట ద్వారానే తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒక శివరాత్రి నాడు వేటకు వెళ్లిన అతడికి రోజంతా ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఆకలితో, అలసటతో ఉన్న అతడు ఆ రాత్రికి ఇంటికి వెళ్లలేక, ఒక సరస్సు ఒడ్డున ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రాత్రి నీళ్లు తాగడానికి వచ్చే జంతువును వేటాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ బోయవాడు ఎక్కినది సాక్షాత్తూ శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షం (మారేడు చెట్టు). ఆ చెట్టు కింద ఎవరికీ తెలియకుండా ఒక శివలింగం వెలిసి ఉంది.
తెలియక చేసిన అర్చన: రాత్రంతా మేల్కొని ఉండటం కోసం బోయవాడు ఆ చెట్టు ఆకులను (బిల్వ దళాలను) ఒక్కొక్కటిగా తెంపి కింద పడేయసాగాడు. అతనికి ‘శివ శివ’ అనడం అలవాటు కావడంతో, ప్రతి ఆకును కోస్తూ శివ నామస్మరణ చేయసాగాడు. అలా ఆ మారేడు ఆకులు కింద ఉన్న శివలింగంపై పడి ‘బిల్వార్చన’గా మారాయి. ఆ రోజు అతడు ఆహారం తీసుకోకపోవడం వల్ల అది ‘ఉపవాసం’ అయ్యింది, నిద్రపోకుండా ఆకులు తెంపడం ‘జాగరణ’ అయ్యింది. తన మొలకు కట్టుకున్న నీళ్ల పాత్ర నుండి కొన్ని నీటి చుక్కలు లింగంపై పడటం ‘అభిషేకం’గా మారింది.
జింకల సత్యనిష్ఠ – బోయవాడిలో మార్పు: ఆ రాత్రి నాలుగు జాములలో నాలుగు జింకలు (ఆడ జింకలు, మగ జింక మరియు పిల్ల జింక) అక్కడికి వచ్చాయి. బోయవాడు వాటిని చంపబోగా, బోయవాడు బాణం ఎక్కుపెట్టగా, ఆ జింక తాను గర్భవతినని, తనను చంపడం అధర్మమని, వదిలిపెట్టమని వేడుకుంది. తర్వాత జింకలు, తమ బాధ్యతలను తీర్చుకుని తిరిగి వస్తామని సత్యప్రమాణం చేశాయి. ఆ మూగజీవాల సత్యనిష్ఠ, భాషను చూసి బోయవాడు ఆశ్చర్యంతో వాటిని వదిలిపెట్టాడు.”తెల్లవారుజామున ఆ జింకలన్నీ తమ మాట ప్రకారం ప్రాణత్యాగానికి సిద్ధమై బోయవాడి వద్దకు వచ్చాయి. వాటి నిజాయితీని చూసి బోయవాడి హృదయం ద్రవించింది. హింస చేయడం పాపమని గ్రహించి, వేటను వదిలివేసి సన్మార్గుడిగా మారాడు.
కైలాస ప్రాప్తి: సరిగ్గా అప్పుడే శివదూతలు విమానంలో వచ్చి అతడిని కైలాసానికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. తాను ఎప్పుడూ శివుడిని పూజించలేదని బోయవాడు ఆశ్చర్యపోగా, దేవదూతలు ఇలా వివరించారు: “ఓ పుణ్యాత్ముడా! ఈరోజు మహాశివరాత్రి. నీవు తెలియకుండానే రోజంతా ఉపవాసం చేశావు, రాత్రంతా జాగరణ చేస్తూ బిల్వ పత్రాలతో శివుడిని అర్చించావు. నీ భక్తికి, నీలో కలిగిన మార్పుకు పరమేశ్వరుడు ప్రసన్నుడై నీకు మోక్షాన్ని ప్రసాదించాడు.”
ఉపవాసం:-
ఉపవాసం చేస్తే శరీరానికి మంచిది. అలా అని కఠిక ఉపవాసం చేయరాదు. ఉపవాసం అంటే మన మనస్సుని పరమేశ్వరునికి దగ్గరగా ఉంచితే దానిని ఉపవాసం అంటారు. ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. ఇది మనసును శుద్ధి చేస్తుంది. ముసలివాళ్ళు, చిన్నపిల్లలు, ఆరోగ్యం సహకరించని వారు, గర్భిణి స్త్రీలు ఉపవాసం చేయాల్సిన నియమం లేదు, ఎవరు ఆరోగ్యాన్ని వారు దృష్టిలో పెట్టుకుని ఉపవాసం చేయాలి, దానివల్ల ఏమి దోషం రాదు.
జాగరణ:-
నిద్రపోకుండా ఉంటే దానిని జాగరణ అంటారు, ఆ రోజు రాత్రి నిద్ర పోకుండా భగవంతుని నామ స్మరణ, పురాణగాధలు వినటం ఇలాంటివి చేయవచ్చు. దీనివల్ల తామస గుణాలు నశించి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది.

మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజని పురాణాలు ఏమి చెబుతున్నాయి?
దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి:
లింగోద్భవం: బ్రహ్మ, విష్ణువుల మధ్య తలెత్తిన అహంకారాన్ని తొలగించడానికి, పరమశివుడు ఆది అంతం లేని మహా ‘అగ్ని లింగం’గా ఆవిర్భవించిన పవిత్ర దినం ఇదే.
శివపార్వతుల కళ్యాణం: లోకకళ్యాణం కోసం శివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్న శుభ ముహూర్తం ఈ మహాశివరాత్రి.
శివ తాండవం: సృష్టి, స్థితి, లయకారకుడైన మహేశ్వరుడు అత్యంత ఆనందంతో ‘ఆనంద తాండవం’ చేసే పవిత్ర రాత్రి ఇది.
హాలాహల భక్షణం: క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కాలకూట విషాన్ని మింగి, లోకాన్ని కాపాడటం కోసం శివుడు ‘నీలకంఠుడు’గా మారిన పుణ్యకాలం ఈ శివరాత్రి.
లింగోద్భవ కాలం: శివరాత్రిలో అత్యంత పవిత్ర ఘడియలు:
మహాశివరాత్రి రోజున భక్తులందరూ ఎదురుచూసే ముఖ్యమైన సమయం ‘లింగోద్భవ కాలం’. దీనిని శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన సమయంగా పరిగణిస్తారు.
సమయం: శివరాత్రి నాటి అర్ధరాత్రి 11:50 నుండి 1:00 గంటల మధ్య ఉండే కాలాన్ని ‘లింగోద్భవ కాలం’ అంటారు.
ప్రాముఖ్యత: ఈ సమయంలో చేసే శివారాధన కోటి రెట్ల ఫలితాన్నిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సాక్షాత్తు శివుడే ఈ సమయంలో భూమిపై లింగ రూపంలో ఉద్భవిస్తాడు కాబట్టి, ఈ గంటన్నర సమయం అత్యంత శక్తివంతమైనది.
ఏం చేయాలి?:
లింగోద్భవ కాలంలో శివలింగానికి మహా న్యాస పూర్వక రుద్రాభిషేకం చేయడం శ్రేష్టం.
ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదారతో (పంచామృతాలు) అభిషేకం చేయాలి.
ముఖ్యంగా బిల్వ దళాలతో (మారేడు ఆకులు) చేసే అర్చన ఈ సమయంలో శివునికి అత్యంత ప్రీతికరం.
ఈ సమయంలో ‘లింగాష్టకం’ లేదా ‘శివ పంచాక్షరీ మంత్రాన్ని’ (ఓం నమః శివాయ) జపించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

మహాశివరాత్రి 2026 రోజు పఠించాల్సిన మంత్రాలు:
- జాతక దోషాలు తొలగడం కోసం – ఓం నమో భగవతే రుద్రాయ నమః
- ఐశ్వర్యం కోసం – శ్రీశివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః
- సర్వ శుభాలకు – ఓం నమః శివాయ (పంచాక్షరీ మంత్రం)
దశరుద్ర నామాలు:
- ఓం నిధన పతయే నమః
- ఓం ఊర్ధ్వాయ నమః
- ఓం హిరణ్యాయ నమః
- ఓం సువర్ణాయ నమః
- ఓం దివ్యాయ నమః
- ఓం భవాయ నమః
- ఓం సర్వాయ నమః
- ఓం శివాయ నమః
- ఓం జ్వాలాయ నమః
- ఓం ఆత్మాయ నమః
బిల్వదళాలతో శివ పూజ చేస్తే మంచిది. శివరాత్రి రోజు నమఃశివాయ అన్న చాలు, ఒక్క బిళ్వదళం వేసిన చాలు, ఒక చెంబుడు నీళ్ళు పోసిన చాలు విశేషమైన ఫలితం వస్తుంది అంతటి విశిష్టత ఉంది. తెలియక చేసిన విశేషమైన ఫలితం వస్తుంది. మన జాతకంలో దోషాలు పోతాయి, మన పాపం పరిహరించబడుతుంది. శివరాత్రి రోజు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి ఒక చెంబుడు నీళ్ళు పోసి, నమః శివాయ అన్న చాలు. ఆ రోజు ఎవరిని నిందించకూడదూ, గొడవలు పడకూడదు. ఆ రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం దేవాలయాలలో కన్నుల పండుగగా చేస్తారు.
ఉపవాసం ముగింపు:
ఫిబ్రవరి 16వ తేదీన ఉదయం 06:42AM నుంచి మధ్యాహ్నం 03:10PM గం|| మధ్య పారణ చేయవచ్చు. మహాశివరాత్రి రోజు శాస్త్రోక్తంగా శివుడికి వేద మంత్రాలతో ఆరాధించ లేకపోయినా, కనీసం చెంబుడు నీళ్ళు శివలింగం మీద పోసిన ఒకే ఫలితం వస్తుంది. ఎవరి శక్తి కొలది వారు పూజ చేసుకోవచ్చు. మహాశివరాత్రి రోజు ప్రదోష వేళ సాయంత్ర సమయం శివ అష్టోత్తర శతనామావళి, శివ పంచాక్షరి, లింగాష్టకం, చంద్రశేఖర అష్టకం, బిల్వాష్టకం ఇలా ఏది చదివిన విశేషమైన ఫలితం వస్తుంది. చదవటం రాని వారు కనీసం విన్నా అదే ఫలితం వస్తుంది. అన్నింటికి భక్తి, శ్రద్ధ ప్రధానం.
2026 శ్రీశైల యాత్ర ప్లాన్ చేస్తున్నారా?
మీరు ఈ శివరాత్రికి శ్రీశైలం వెళ్లాలనుకుంటే, రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందే వసతి మరియు దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవడం మంచిది. కృష్ణమ్మ ఒడిలో వెలసిన ఆ పరమేశ్వరుని దర్శనం మీ జీవితంలో మరుపురాని అనుభూతిని మిగుల్చుతుంది.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం.. శివశక్తుల కలయికకు నిలయం. ఇక్కడ మహాశివరాత్రి పండుగను ‘బ్రహ్మోత్సవాల’ రూపంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీశైలంలో ప్రత్యేకతలు:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు: శ్రీశైలంలో శివరాత్రికి ముందు, తర్వాత కలిపి మొత్తం 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో మల్లికార్జున స్వామి వారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.
లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం: శివరాత్రి అర్ధరాత్రి వేళ స్వామివారికి జరిగే మహారుద్రాభిషేకం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. వేలాది మంది భక్తుల మధ్య, వేద మంత్రోచ్ఛారణలతో జరిగే ఈ అభిషేకం అత్యంత పవిత్రమైనది.
పాగాలంకరణ (శిఖర అలంకరణ): శ్రీశైలంలో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన ఘట్టం ఇది. శివరాత్రి రోజు రాత్రి స్వామివారి కళ్యాణ సమయంలో, గర్భాలయ విమాన గోపురానికి నూలుతో చేసిన భారీ పాగాను అలంకరిస్తారు. ఇది చూడటం ఒక అదృష్టంగా భక్తులు భావిస్తారు.
పాదయాత్రల సందడి: తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి కూడా వేలాది మంది భక్తులు కఠినమైన నల్లమల అడవి మార్గంలో నడుచుకుంటూ ‘శంభో శంకర’ నామస్మరణతో శ్రీశైలానికి చేరుకుంటారు.
శ్రీశైల దేవస్థానం అధికారిక వెబ్సైటు ని విసిట్ చేయండి మరిన్ని విషయాల కోసం.
మీకు ఈ వ్యాసం నచ్చితే:
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
📢 Join Our WhatsApp Channel here:



