అమరావతి దేవాలయం (Amaravati temple) ప్రక్కన కృష్ణానది ప్రవహించడానికి ఒక గొప్ప రహస్యం ఉంది:
Amaravati temple history in telugu:
ఈ అమరారామము (Amaravati Temple history) పంచారామ క్షేత్రాలలో ఒకటి. పవిత్ర కృష్ణా నది తీరాన క్రౌంచ గిరి పై వెలసిన అమరేశ్వరుని స్వయంగా దేవేంద్రుడు ప్రతిష్టించాడు అని స్కాంద పురాణంలో పేర్కొనడం జరిగింది. క్రీస్తు శకం 1517 లో శ్రీకృష్ణదేవరాయలు, 1621లో హంత్రికం పెద్దప్ప తదితర మహనీయులు ఈ క్షేత్రాన్ని దర్శించి విశేష కానుకలు, మాన్యాలు ఇచ్చి చరితార్థులు అయ్యారని తెలుస్తుంది. క్రీస్తుశకం 1783, 1861 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో ఈ ఆలయ అభివృద్ధి జరిగిందని తెలుస్తుంది.
ఈ ఆలయం చాళుక్య భీముని కాలంలో క్రీస్తు శకం 892, 922లో నిర్మించబడిందని, అశోకుని కాలం నుండి తర్వాత శాతవాహనులు మొదలుగా గల వివిధ రాజవంశీయుల పరిపాలనలో క్రీస్తు శకం 14, 15 శతాబ్దముల వరకు ఈ మహా క్షేత్రం విశేష ప్రజాదరణతో వర్ధిల్లి నట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది.
అమరేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు ఇక్కడ ఆలయానికి సమీపంలో ఉన్న అమరేశ్వర స్వామి స్నాన ఘట్టానికి చేరుకుంటారు, సువిశాలమైన ఈ స్నాన ఘట్టం భక్తులను మైమరిపిస్తుంది, ఆలయ వెనుక భాగంలో కృష్ణమ్మ ప్రవహిస్తూ ఉంటుంది, ఈ కృష్ణా నదిలో భక్తులు స్నానాలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయం మూడు ప్రాకారాలతో, సువిశాలమైన ఆవరణలో నిర్మించబడి ఉంటుంది.
📢 Join Our WhatsApp Channel here:
ఈ ఆలయం భక్తులకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది, ఈ ఆలయంలో శివలింగం 15 అడుగుల ఎత్తులో ఉంటుంది, ఆలయం వెలుపల పంచలోహాలతో చేసిన ధ్వజస్తంభం కనిపిస్తుంది, ధ్వజస్తంభానికి ఎదురుగా తూర్పున సూర్య భగవానుని ఆలయం ఉంటుంది, ఇక్కడ స్వామిని దర్శించే భక్తులకు సూర్యభగవానుడు శక్తి ఇస్తాడని చెబుతారు, ఆలయ ప్రాకారాల మీద అలనాటి శాసనాలు కనిపిస్తాయి.

ఇవి అమరావతి క్షేత్ర (Amaravati Temple) ప్రాశస్త్యాన్ని, ఆలయ విశేషాలను విసదీకరిస్తాయి, ఇదే ప్రాంగణంలో కుడివైపున “బాల చాముండేశ్వరి మాత దర్శనమిస్తుంది”, గర్భగుడిలోనికి ప్రవేశించగానే పంచలోహాల స్వరూపుడైన “నందీశ్వరుడు” దర్శనం ఇస్తాడు, గర్భాలయంలో దర్శనమిచ్చే అమరేశ్వర స్వామి 15 అడుగుల ఎత్తులో “స్పటిక వర్ణ శివలింగ” రూపంలో దర్శనమిస్తాడు.
ఈ దేవస్థాన విశిష్టతను గూర్చి స్కాంద పురాణంలో విశేషంగా చెప్పబడినది, ఈ అమరేశ్వర స్వామి వారు “క్రౌంచ” గిరి నాధుడిగా ప్రసిద్ధి, క్రౌంచ గిరి నాధుడు, కారుణ్య హృదయుడు, కలి దోశ నివారకుడు, కొంగు బంగారు దేవుడు ఈ అమరేశ్వరుడు.
అమరలింగాన్ని ఎవరు ప్రతిష్టించారు?
ఇంద్రుడు స్వయంగా దేవతల యొక్క బాధలు చూడలేక ప్రార్థన చేస్తే, సుబ్రహ్మణ్యుడు సర్వ సైన్యాధిపత్యం వహించి తారకాసుర సంహారం చేశాడు, ఇంద్రుడే ప్రతిష్ట చేయడానికి వెళ్ళినటువంటి లింగం, ఆ కృష్ణా నది ఒడ్డున ఉన్నటువంటి “అమరావతి క్షేత్రం (Amaravati Temple)”. కానీ అక్కడ శివలింగం పడగానే తెల్లటి స్వరూపంతో పైకి పెరిగిపోయింది, పైకి పెరిగిపోతుంటే ఇంద్రుడు, బృహస్పతిని ఒక మాట అడిగాడు, ఈ శివలింగం ఇలా పెరిగిపోతుంది కదా, ఎలా దీన్ని ఆరాధన చేయటం.
భక్తితో నమస్కారం చేయి అలా నిలబడుతుంది అన్నాడు బృహస్పతి. నమస్కారం చేస్తే పెరుగుతున్న శివలింగం అలా ఆగిపోయింది. అందుకే మీరు అమరావతి వెళ్ళినప్పుడు అమరావతి శివలింగాన్ని కింద నుంచి అభిషేకం చేయడం కుదరదు, అభిషేకం కోసం వేరే అంతస్తు ఉంటుంది ఆ అంతస్తు మీద నిలబడి పైనుంచి అభిషేకం చేస్తారు.

కలియుగంతంలో మునిగిపోని దేవాలయం:
కృష్ణానది అక్కడ ఉండడానికి ఒక రహస్యం ఉంది, కారణం ఏంటంటే అక్కడ దేవేంద్రుడు ప్రతిష్ట చేసే ముందు ఒక మాట అడిగాడు. అప్పుడు అక్కడ కృష్ణా నది లేదు, శివలింగ ప్రతిష్ట జరిగేటప్పటికీ, కానీ కలియుగంలో బ్రహ్మగారు మళ్లీ నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేసినప్పుడు, ఇటునుంచి కృష్ణా నది వెళుతుంది, వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని కొట్టుకుపోయేట్టుగా ముంచెత్తదా అని అడిగాడు, అప్పుడు దేవతలు ఆ రోజున ఒక మాట చెప్పారు దీన్ని “క్రౌంచము” అని పిలుస్తారు.
ఈ కొండ చుట్టూ తిరుగుతుంది తప్ప ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం కృష్ణా నది ఎన్నడు ఈ కొండను ముంచెత్తదు, దీని మీద శివలింగం అలాగే ఉంటుంది అని చెప్పారు. అందుకే అక్కడికి వెళ్లి దేవతలు చాలా కాలం స్నానం చేసి ఆ దేవాలయంలో ఆరాధన చేసి ఎటువంటి కష్టాలనైనా సరే తట్టుకోవడానికి వీలుగా అసురులను జయించగల బలాన్ని అక్కడ ఆరాధన చేసి పొందారు.
అమరావతి దగ్గర ఉన్న కృష్ణా నదిలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం:
అమరావతి(Amaravati Temple)క్షేత్రానికి వెళ్లి కృష్ణా నదిలో స్నానం చేసి, అమరావతి దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఒక విషయాన్ని గమనించాలి, కృష్ణా నదిలో స్నానం చేస్తే “గంగ ముఖము” నందు స్నానం అంటే “హరిద్వార్” గంగా స్నానంతో సమానం, అక్కడి నుంచి స్నానం చేసి ఒడ్డుకి వచ్చి తల ఎత్తి చూస్తే మూడు ప్రాకారములు కనబడతాయి అమరావతిలో, ఆ మూడు ప్రాకారములే త్రిగుణాతీతుడైనటువంటి పరమేశ్వరుడు లోపల ఉన్నాడు, అక్కడ వెలిశాడని గుర్తు, ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి అమ్మవారు పేరు చాలా చమత్కారమైనటువంటి పేరు “బాల చాముండేశ్వరి” అని పేరు ఆవిడకి, అది పంచాయతన దేవాలయం.
అక్కడ శివుడు, పార్వతి అంటే అంబిక, అక్కడ శ్రీమహావిష్ణువుకి “వేణుగోపాల స్వామి” రూపంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది శివ కేశవ అభేదంగా. అక్కడ వేణుగోపాలస్వామి, వినాయకుడు, సూర్యనారాయణ మూర్తి, సూర్యనారాయణ ప్రతిష్ట జరిగింది ఆ దేవాలయంలో కాబట్టి శివపంచాయతనంతో కూడినటువంటి దేవాలయం అమరావతి.
పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే తప్ప దర్శించలేని దేవాలయం:
మాఘమాసంలో కృష్ణా నదీ స్నానం చేసి, వెంటనే అమరావతి దర్శనం చేయడం మహద్భాగ్యం, దాని గురించి “స్కాంద పురాణంలో” ఒక మాట చెప్తారు, ప్రయత్న పూర్వకంగా మాఘమాసం లాంటి మాసంలో కృష్ణా నది స్నానం చేసి అమరావతి క్షేత్ర దర్శనం చేద్దామని ప్రయత్నం చేసిన పరమేశ్వరుని అనుగ్రహం ఉన్న వాళ్ళని తప్ప ఇతరులను రానివ్వడు అని చెప్తారు.
మాఘ మాసంలో స్నానం, ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే చేస్తున్నటువంటి స్నానం కాబట్టి “కృష్ణానది స్నానం మరియు అమరావతి(Amaravati Temple) దర్శనం అంత గొప్పవి”. అమరావతి దేవాలయం శిథిలమైతే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆ దేవాలయాన్ని అంతటినీ పునర్నిర్మానం చేశారు, కృష్ణదేవరాయలు తులాభారం తూగినటువంటి మండపం, వెంకటాద్రి నాయుడు గారి తులాభారం తూగినటువంటి మండపం ఆ దేవాలయంలోనే ఉన్నాయి.
వెంకటాద్రి నాయుడు గారు మరణించిన తర్వాత అమరావతి దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి కావలసినటువంటి సంభారములు కూడా లేకుండా పోయాయి, దీపం పెట్టడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఆ స్థితిలో ఉంటే, చిందులాల్ అనే వ్యక్తి హైదరాబాద్ నవాబుగా ఉన్నటువంటి “నాజర్ దౌలత్” దగ్గరికి వెళ్లి, మీరు ఈ దేవాలయ పోషణకి కావలసినటువంటి సదుపాయం చేయండి అని అన్నారు, ఆ దేవాలయాన్ని నేను పోషించడానికి అందులో ఎవరు ఉన్నారు అని అడిగారు నవాబు నాజర్ దౌలత్, అప్పుడు చిందులాల్ శివుడు ఉన్నాడు అన్నాడు, శివుడికి పోషణ నావల్ల కావాలంటే ఆయన నన్ను అడుగుతాడులే నువ్వు వెళ్ళు అన్నాడు నవాబు.
ఆ రాత్రి నవాబు పడుకున్నారు, పడుకుంటే కలలోకి పరమశివుడు వచ్చి, “నా పోషణ కొరకు కాదు, నేను లోకాలను పోషించేవాడిని నాకు ధూప, దీప, నైవేద్యాలు జరగడం లోకానికి అంతటికి శాంతికారకం, కాబట్టి నువ్వు ఏర్పాటు చెయ్యి భక్తుల కోరిక మన్నించు“ అని చెప్పాడు. ఆయన 450 ఎకరాల పొలం సుక్షేత్రమైనటువంటి పొలాన్ని, ఈనాముల్ని, కానుకల్ని, నవాబ్ అమరావతి దేవాలయానికి ఇచ్చాడు. ఆ తరువాత కాలంలో ఎందరో మహానుభావులు కానుకలు ఇచ్చారు, అంత గొప్ప దేవాలయం. ఈశ్వరుడు ఉన్నాడు, ఉన్నాడు, అని ఒకటికి పదిసార్లు నిరూపించినటువంటి క్షేత్రం “అమరావతి”.
అమరావతి అన్న పేరు దేవతల రాజధాని ఈ భూలోకంలో అమరావతి పేరుతో ఉన్న ఏకైక క్షేత్రం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రం, ఎందుకంటే దేవతలు కూడా ఎవరిని ఆరాధన చేసి బలాన్ని పొందుతారో అటువంటి వాడు అక్కడ ఉన్నాడు, అంత గొప్ప క్షేత్రం “అమరావతి(Amaravati Temple)“.
పంచారామ క్షేత్రాల గురించిఇక్కడ చదవండి.
మీకు ఈ వ్యాసం నచ్చితే:
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
📢 Join Our WhatsApp Channel here:







