Ambarisha Upakhyana Ekadashi Vratam:అంబరీషోపాఖ్యానం: ఏకాదశి వ్రత మహత్యం మరియు భక్తుడి రక్షణలో శ్రీమహావిష్ణువు!
అంబరీషోపాఖ్యానం అంటే ఏమిటి? (What is Ambarisha Upakhyana/Ambarishopakhyanam?)
హిందూ ధర్మంలో ‘ఏకాదశి’ తిథికి అత్యంత విశిష్టత ఉంది. “న గాయత్రీ పరమ మంత్రం.. న మాతుః పరదైవతమ్.. న కాశ్యాః పరమం తీర్థం.. న ఏకాదశ్యాః పరం వ్రతమ్” అని శాస్త్ర వచనం. అంటే ఏకాదశికి మించిన వ్రతం మరొకటి లేదు. అటువంటి ఏకాదశి వ్రత ప్రాముఖ్యతను, భగవంతుడికి తన భక్తులపై ఉండే అచంచలమైన ప్రేమానురాగాలను చాటి చెప్పే అద్భుత గాథే అంబరీషోపాఖ్యానం.
అంబరీషుడు అనే రాజర్షి రాజ్యపాలన చేస్తూనే, శ్రీమహావిష్ణువుపై అచంచలమైన భక్తిని కలిగి ఉండేవాడు. ఆయన నిష్ఠగా ఆచరించిన ఏకాదశి వ్రతం, ఆ సమయంలో ఆయనకు ఎదురైన పరీక్ష, మరియు దుర్వాస మహాముని కోపం నుండి భగవంతుడు తన భక్తుడిని ఎలా కాపాడాడు అనే విషయాలు ఈ కథలో ప్రధానాంశాలు.
శ్రీమద్భాగవతంలోని నవమ స్కంధంలో వివరించబడిన ఈ వృత్తాంతం, కేవలం ఒక భక్తుడి కథ మాత్రమే కాదు, క్రమశిక్షణతో కూడిన వ్రతాచరణ వల్ల కలిగే ఫలితాన్ని మరియు భగవంతుడు ‘భక్త పరాధీనుడు’ అనే సత్యాన్ని మనకు బోధిస్తుంది.
ఈ వ్యాసంలో మనం అంబరీష మహారాజు ఎవరు? ఆయన ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించారు? మరియు సుదర్శన చక్రం దుర్వాస మునిని ఎందుకు వెంబడించింది? వంటి ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం.
📢 Join Our WhatsApp Channel here:
అంబరీష మహారాజు ఎవరు?
అంబరీషుడు ఒక రాజు, గృహస్తు ఆశ్రమాన్ని చేపట్టినవాడు, అంబరీషుడికి వివాహానికి పూర్వం కూడా, బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి గొప్ప ఈశ్వర భక్తి ఉన్నవాడు, ఆయన మనస్సు ఎప్పుడు భగవంతుని యొక్క పాదముల యందు ఉంటుంది, ఆయన చిత్తం ఎప్పుడు శ్రీమహావిష్ణువుని యొక్క పాదాలను పట్టుకుని ఉంది. అంబరీషుడు సంసారంలో తరించాడు.
అంబరీషుడు రాజుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు, సంసారంలో కూడా తన కర్తవ్యాన్ని నిర్వహించాడు, ఈశ్వరుడి స్మరణ చేసేవాడు, అంబరీషుడు చెవులు ఎప్పుడు మాధవుడి కథా శ్రవణం కోసం ఉత్సాహం పొందుతూ ఉంటాయంట, ఆయన రాజ్యపాలన చేసేటప్పుడు షడ్రశోపేతమైన భోజనం పెట్టేవారు, ఆయన ఎలా తినేవాడు అంటే శ్రీమన్నారాయణుడు ఆహార రూపమై వచ్చి తనలోకి ప్రవేశిస్తున్నాడు అని ప్రసాదంగా తినేవాడు, ఈశ్వర నివేదన చేసి ఆయన తినేవాడు, ఎవరితో మాట్లాడిన, ఎవరు ఎన్నిసార్లు వచ్చి మాట్లాడిన, ఎంతమందితో మాట్లాడిన, శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు నాతో మాట్లాడడానికి అనేవాడు, ఏది కనపడినా, ఏ వస్తువు కనపడిన శ్రీమన్నారాయణుడు ఎన్ని రూపాలలో కనపడుతున్నాడో అని పరవశించి పోయేవాడు.
అంతటా ఈశ్వర దర్శనం చేసేవాడు, ఏదైనా వాసన చూసినా శ్రీమన్నారాయణుడు ఈ వాసనా రూపంలో ఉన్నాడు అని పీల్చేవాడు, ఏదైనా పట్టుకుంటే, పంచభూతాలుగా ఆయనే ఉన్నాడు అని పట్టుకునేవాడు, ఆయనకి దేనిమీద కోరిక లేదు, రాజ్యం మీద కోరికలేదు, భార్య మీద కోరికలేదు, సంపద మీద కోరికలేదు, అంతఃపురం మీద కోరికలేదు, అయినా ఆయన అన్నిటిలో ఎలా ఉన్నాడు అంటే, ఆయనకి కర్తవ్యం మాత్రమే ఉంది, అతి ప్రేమ లేదు, అతి వ్యామోహం లేదు, కర్తవ్యం అంబరీషుడికి ఈశ్వర భక్తిలో నుంచి వచ్చింది.
పంచభక్ష పరమాన్నమైన మితముగానే తినేవాడు అంతటా ఈశ్వరుడిని చూసి శాశ్వతమైన వస్తువు(ఈశ్వరుడు) ఏది ఉందో దానిని పట్టుకుని, అశాశ్వతమైన విషయాల పట్ల కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించేవాడు, వైరాగ్యం నందు ఉన్నాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్యములను గృహస్థాశ్రమంలో ఉండి పొందాడు, అటువంటి అంతఃపురం ఉండి ఇలాంటి వైరాగ్యాన్నిపొందాడు.
అంబరీష మహారాజు ఆచరించిన ఏకాదశి వ్రత నియమాలు:
ఆయన ఒకసారి సరస్వతీ నది తీరంలో అశ్వమేధ యాగం చేశాడు, దానికి వశిష్టాది మహర్షులు వచ్చారు, అందరినీ సేవించి తాంబూలాలు ఇచ్చాడు, ఒక సంవత్సరం పాటు ద్వాదశి వ్రతం చేయాలి అనుకున్నాడు, ఏకాదశి వ్రతం అన్నా, ద్వాదశి వ్రతం అన్నా తేడా లేదు, దశమి నాటి సాయంత్రం నుంచి ఉపవాసం ప్రారంభం చేస్తారు. ఉపవాసం అంటే అశనము అనే పేరు ఉంది శాస్త్రంలో, అశనము అంటే క్రిందటి జన్మలో ఉన్న దరిద్రాన్ని అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్న, ఆకలి వేస్తున్న, తినకుండా తనని తాను ఒకరోజు మార్చుకుంటే అశనం అంటారు, ఈశ్వరుడి యందు బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైన ఆహారం తిని శరీరం నిలబెట్టుకోవాలో, ఈశ్వరార్పితమైన అంత ప్రసాదం తిని శరీరం నిలబెట్టుకుంటే దానిని ఉపవాసం అంటారు.
ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి, ద్వాదశి రోజు పారణ చేయాలి, పారణ అంటే ద్వాదశి రోజు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినేయొచ్చు. సూర్యోదయం అవగానే భోజనం చేసేయవచ్చు, కానీ ఈయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు, ఆయనకి తగినటువంటి భార్యని పొందాడు.
ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేద్దాం అంది అంబరీశుని భార్య, దానికి ఆయన కార్తీకమాసంలో మొదలుపెడదాం అన్నాడు, మొదలుపెట్టి వచ్చే సంవత్సరం కార్తీకమాసంలో ద్వాదశి తిధి రోజు పారణ చేద్దామన్నాడు, అంటే పూజా మందిరంలో పడుకుంటారు భార్యాభర్తలు, ఈశ్వరుని పాదముల దగ్గర పడుకుని, శరీరం నిలబడడానికి కావలసిన అంత ఆహారం మాత్రమే తింటూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, నిరంతరం భగవంతుడి నామస్మరణ చేస్తూ, మళ్లీ అన్ని రకాల పదార్ధములతో కూడిన భోజనం తినడం అనేది మళ్లీ సంవత్సరం తర్వాత వచ్చే ద్వాదశి రోజు మాత్రమే, అలా ఒక సంవత్సరం పాటు అలాంటి వ్రతం చేద్దాము అంది అంబరీశుని భార్య.
సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం పూర్తి చేసేశారు, ఏకాదశి వ్రతం అయిపోయింది తెల్లవారింది, భోజనం చేసే ముందు, సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేశారు కాబట్టి కాళింది నది (యమునా నది) వద్దకు వెళ్లి నదీ స్నానం చేశారు, మధువనంలోకి వెళ్లి శ్రీకృష్ణుడికి అభిషేకం చేశారు, అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు, వాళ్లకి గోవులు దానం ఇచ్చాడు అంబరీషుడు.
బంగారంతో కొమ్ములు, వెండితో డెక్కలు చేయించి వాటికి తగిలించాడు, దూడలతో కూడిన ఆవులు తెచ్చాడు, అవి మంచి వయస్సులో ఉన్న ఆవులు, దూడలు వెళ్లి పొదుగుని ముట్టుకోగానే పాలు వచ్చేస్తున్నాయి, అటువంటి ఆవులను మందలు మందలుగా తీసుకొచ్చి అటువంటి ఆవులను దానం చేశాడు.
ఆ బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టాడు, అతిధిని ఈశ్వరుడిగా భావిస్తే ఈశ్వరుడు తింటాడు, మిగిలిన భోజనం బ్రహ్మము వచ్చి తినిగా మిగిలిన భుక్తశేషం అవుతుంది, అప్పుడు దానిని తింటే విజయం వస్తుంది, కాబట్టి ఆ బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి, ఆయన ద్వాదశ పారణ చేయాలి కాబట్టి ఆయన కూడా భోజనం చేద్దామని కూర్చోగానే దుర్వాసుడు వచ్చాడు అంబరీషుడు ఇంటికి.
Ambarisha Upakhyana-అంబరీషోపాఖ్యానంలో దుర్వాస మహాముని ఆగ్రహం – అసలు కథ:
దుర్వాసుడు సర్వకాలముల యందు, వేదముల యందు, బుద్ధిని నిక్షేపించినవాడు, గొప్ప తపస్సుని పాటించినవాడు, సూర్యుడు ఎలా ఉంటాడో అంత తేజోవంతుడు, అతిధి యందు దోషములను విచారణ చేయకూడదు, గుణము మాత్రమే చూడాలి. దుర్వాసుడిని చూసి, అంబరీషుడు పొంగిపోయి, ఈశ్వరుడు వచ్చాడు నా ఇంటికి ఏమి భాగ్యం, ఇంతమందికి భోజనం పెట్టాను, ఈరోజు ద్వాదశి పారణ అందుకని మీరు కూడా మహాత్ములు గనుక, మీరు కూడా వచ్చి భోజనం చేయాలి, మీరు చేశాక నేను చేస్తా అన్నాడు అంబరీషుడు, త్వరగా స్నానం చేసి రండి అన్నాడు, అలాగే వస్తాను అని అన్నాడు దుర్వాసుడు.
దుర్వాసుడు త్వరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు, ఆయన యమునా నదీ జలాలలో స్నానానికి దిగి ధ్యానం చేస్తూ ఈశ్వరుడిని స్మరించాడు, దుర్వాసుడు మహా భక్తుడు, ఈశ్వర జ్ఞానం వలన సమయం మర్చిపోయాడు, కాబట్టి ఆయనకి దోషం లేదు, కానీ అంబరీషుడు పారణ చేయాలి, లేకపోతే ద్వాదశి వెళ్ళిపోతుంది. వ్రత భంగం అయిపోతుంది, వ్రత భంగం అయిపోతే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఎలా అని ఆలోచిస్తున్నాడు, ఇవన్నీ ఈశ్వరుడికి ముందే తెలుసు, తన భక్తుడికి రాబోయే ఉపద్రవాన్ని లెక్క కట్టుకోవలసిన వాడు పరమాత్మ, భక్తితో ఉంటే రాబోయే ఆపద నుంచి భగవంతుడే పరిగెత్తుకొచ్చి కాపాడతాడు.
శ్రీమహావిష్ణువుకి తెలుసు, ఈ ప్రమాదం వస్తుందని, అంబరీషుడు మహా భక్తుడు, శ్రీమహావిష్ణువు ఎంత భయపడ్డాడు అంటే ఆ సమయం వచ్చేసరికి ఏమరపాటు చెందితే ఎలాగా అని, తన సుదర్శనాన్ని అంబరీషుడు ఇంట్లో పెట్టాడు, ఏమరపాటు లేని వాడు, భక్తుడి విషయంలో ఏమరపాటు వస్తుందేమోనని భయపడి అక్కడ ఉంచాడు, అది భగవంతుడు భక్తికి లొంగిపోవడం అంటే, ఆయనకి భూత, భవిష్యత్తు, వర్తమానాలు తెలుసు, అందుకే సుదర్శనాన్ని అంబరీషుడు ఇంట్లో పెట్టి జాగ్రత్తగా చూడు అని చెప్పాడు.
అంబరీషుడి ధర్మసంకటం మరియు పండితుల పరిష్కారం:
ఇక్కడ అంబరీషుడికి ఒక గొప్ప ధర్మసంకటం ఎదురైంది. బ్రహ్మజ్ఞాని అయిన మహర్షిని భోజనానికి రమ్మని తొందరపెట్టడం సంస్కారం కాదు. అలా అని పారణ చేయకపోతే వ్రతం నిష్ఫలమవుతుంది. ఒకవేళ ముందే భోజనం చేస్తే, వచ్చిన అతిథిని ఘోరంగా అవమానించినట్లవుతుంది. ఈ ప్రమాదం సామాన్యుడి నుండి కాదు, కోపానికి నిలువెత్తు రూపమైన దుర్వాస మహాముని నుండి పొంచి ఉంది.
ఈ క్లిష్ట పరిస్థితిలో అంబరీషుడు తన సభలోని వేద పండితులను ఆశ్రయించి పరిష్కారం కోరాడు. అప్పుడు ఆ పండితులు ధర్మశాస్త్రాలను అనుసరించి ఇలా సెలవిచ్చారు:
“రాజా! నువ్వు గృహస్థువి, నిష్ఠగా వ్రతాన్ని ఆచరించావు. వ్రతానికి భంగం కలగకూడదు, అలా అని అతిథికి అవమానం జరగకూడదు. శాస్త్రం ప్రకారం.. కేవలం జలపానం (నీళ్లు త్రాగడం) అనేది ఒక మధ్యేమార్గం. నీళ్లు త్రాగడం వల్ల భోజనం చేసినట్లు అవుతుంది (వ్రత నియమం నెరవేరుతుంది), అదే సమయంలో అది పూర్తి భోజనం కాదు కాబట్టి అతిథిని అవమానించినట్లు అవదు.”
పండితుల సూచన మేరకు అంబరీషుడు వినయంగా శిరసావహించాడు. “మహర్షి భోజనం చేయకుండా నేను అన్నం ముట్టను, కానీ తిథి దాటిపోకూడదు కాబట్టి కేవలం తులసి తీర్థాన్ని (నీటిని) మాత్రమే స్వీకరిస్తాను” అని నిశ్చయించుకుని కొద్దిగా నీళ్లు త్రాగాడు.
ఆయన నీళ్లు త్రాగగానే, దుర్వాసుడు ధ్యానం నుంచి బయటకు వచ్చాడు, బయటికి రాగానే దుర్వాసుడికి ఆకలి వేసి గబగబా వచ్చాడు, అంబరీషుడు ఎదురొచ్చి ద్వాదశ తిథి దాటిపోతుంది మీకోసమే చూస్తున్నాను రండి రండి మీరు భోజనం చేశాక చేస్తాను అన్నాడు, దుర్వాసుడికి అనుమానం వచ్చింది, తిని పెడుతున్నాడా? తినకుండా పెడుతున్నాడా? అని ఆలోచించి, నీళ్లు తాగాడు అని తెలుసుకున్నాడు, దుర్వాసుడికి కోపం వచ్చింది, అతిథిని అమర్యాద చేసావు.
ఒక పక్క ఆకలి, ఇంకొ పక్క అతిథిగా పిలిచి అవమానించాడని కోపము, ముందు నీళ్లు తాగి నాకు భోజనం పెడతావా? ఇది అవమానం, ఆ కోపంతో చేతిలోకి నీళ్లు తీసుకుని ఒక జటని పెరికి నేలకేసి కొడతాడు, అందులో నుంచి భయంకరమైన కృత్యు సృష్టించాడు, కృత్యు అంటే ఆయన ఏమి చెప్తే దానితో ఆకలి తీర్చుకుంటుంది, ఆయన కళ్ళ ముందు అంబరీషుడిని కృత్యు తినేయాలి అన్న కోపంతో ఉన్నాడు, అలా తింటుంటే చూడాలి అని అర్థం లేని కోపానికి వెళ్లిపోయాడు.

కృత్యు ఎలా ఉంది అంటే చేతిలో భయంకరమైన శూలం పట్టుకొని, ఆకలితో అది ఎగురుతుంటే భూమి గోతులు పడుతుంది, భయంకరమైన కోపంతో కృత్యు అంబరీషుడి మీద పడింది, దుర్వాసుడు సంతోషిస్తున్నాడు, అందరూ బాధపడుతున్నారు, అంబరీషుడు చిరునవ్వుతో ఉన్నాడు, శ్రీమన్నారాయణుడిని ధ్యానం చేస్తున్నాడు, నేను తెలిసి అపరాధం చేయలేదు మహాపండితులు కూడా ఇదే చెప్పారు, ఇంతకన్నా తెలిసి ఉంటే ఆచరించేవాడిని,(తెలియక చేసిన దోషము దోషము కాదు, పూర్ణమైన ఫలితం వస్తుంది). ధర్మం తప్పలేదు అని అంబరీషుడు నిలబడిపోయాడు, వెంటనే సుదర్శనం కదిలి కృత్యు మీదకి వెళ్తే, కృత్యు కాలిపోయింది.
తర్వాత కృత్యుని ప్రయోగించిన వాడి మీదకి వెళ్ళింది, దుర్వాసుడు మీదకి, సుదర్శనానికి వెన్నుచూపి పరిగెడుతున్నాడు, ఎంత తపస్వి ఆయన, ఎన్ని తెలిసి ఉన్నవాడైనా, అవతలి వారి అమాయకత్వం తెలుసుకోకుండా, మంచితనం దృష్టిలో పెట్టుకోకుండా పరుషమైన ప్రవర్తనతో ఉండకూడదు, దుర్వాసుడు పరిగెడుతున్నాడు, దుర్వాసుడు అన్ని లోకాలలోనూ తిరగ గల శక్తిని తపస్సు చేత సాధించాడు.
అందుకని ఆ వరం చేత సముద్రంలోకి వెళ్లాడు, సుదర్శనం కూడా సముద్రంలోకి వెళ్ళింది, దుర్వాసుడు ఆకాశంలోకి వెళ్ళాడు అక్కడికి కూడా సుదర్శనం వెళ్ళింది, వెన్ను చూపి పరిగెడుతున్నంత సేపు మర్యాద ఉంటుంది ఆయుధాలకి, అది శ్రీమన్నారాయణుడి ఆయుధం, వెన్నుచూపిన వాడిని నరకదు, అందుకని వెనకాల వస్తుంది, రొమ్ము చూపితే కొడదాం అని, ఆయన నిలబడ్డాడు అది కూడా నిలబడుతుంది, ఎక్కడికి వెళ్లినా అది వెంటే వస్తుంది, దాన్ని తప్పించుకోలేకపోయాడు.

ఈశ్వరుడు బుద్ధి చెప్పడం మొదలు పెట్టాడు, పరిగెత్తి పరిగెత్తి బ్రహ్మలోకానికి వెళ్ళాడు, బ్రహ్మగారు ఏమీ తెలియనట్టు, ఏమిటి దుర్వాస ఇటు వచ్చావు అని అడిగాడు, దుర్వాసుడు జరిగినదంతా చెప్పాడు, బ్రహ్మగారు చతురతతో అయ్యయ్యో మహర్షివి ఎంత కష్టం వచ్చింది, అంబరీషుడు జోలికి వెళ్ళావా? భక్తి ఎన్ని తప్పులు అయినా సరిపెట్టేస్తుంది, మీరు కూడా ఆ విశాల హృదయంతోనే ఉండాలి తప్ప భక్తులని అవమానించరాదు అని బ్రహ్మగారు ఉపదేశం చేశారు.
ఎవరు కన్నెర్ర చేస్తే నా బ్రహ్మపదవి ఊడిపోతుందో ఆయనది ఆ ఆయుధం, నువ్వు వెళ్లి శ్రీమహావిష్ణువు కాళ్లు పట్టుకో ఆ సుదర్శనాన్ని నేను ఆపలేను అంటారు బ్రహ్మగారు, అక్కడ నుంచి దుర్వాసుడు కైలాసానికి పరిగెడతాడు, పరమేశ్వరుడు కూడా ఏమీ తెలియనట్టు, ఏమిటి దుర్వాస ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడుగుతాడు, ఏం చెప్పను అయ్యా ఇలా జరిగింది అని జరిగిందంతా చెప్తాడు, సుదర్శనం తరుముతుంది, కాస్త దాన్ని ఆపవయ్యా నీ కన్నా గొప్పవాడు ఎవడున్నాడు అని గొప్ప స్తోత్రం చేశాడు, దానికి ఈశ్వరుడు నాకు, దక్షుడికి, ఇంద్రుడికి, చతుర్ముఖ బ్రహ్మకి, విష్ణు మాయ అర్థం కాదు అలాంటిది ఆ సుదర్శనాన్ని నేను ఎలా ఆపగలను ఆపలేను, ఎలాగో ఇక్కడిదాకా వచ్చావు కదా పక్కనే వైకుంఠం, అక్కడికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడు అని అంటారు.
ఆయన మళ్ళీ పరిగెత్తి వైకుంఠం వెళ్తాడు, వెళ్లేసరికి విష్ణుమూర్తి చక్కగా లక్ష్మీదేవితో పాటు పానుపు మీద కూర్చుని ఉంటాడు, దుర్వాసుడు వెళ్తూనే విష్ణుమూర్తి పాదాల మీద పడిపోయి, తన రెండు చేతులతో, విష్ణుమూర్తి రెండు కాళ్లు గట్టిగా పట్టుకుని లేవడం మానేసి అలాగే ఉండిపోతాడు, ఏంటయ్యా దుర్వాస అలా పడిపోయావు, పైకి లెగు, ఏమైందని అడుగుతాడు, దుర్వాసుడు జరిగింది అంతా చెప్తాడు, సుదర్శనం తరుముతుంది అని చెప్తాడు.
సరే నేను సుదర్శనాన్ని ఆపుతాను అనలేదు అనకుండా విష్ణుమూర్తి ఉపదేశం మొదలు పెడతాడు, “నాకొక బలహీనత ఉంది దుర్వాస, తీగలన్ని పీకి పెద్ద ఏనుగుని కట్టేసినట్టు, నన్ను ఇలా నిలబెట్టేసి తాళ్లతో కట్టి, లక్ష్మీదేవి ఉందని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నా మహా భక్తులు. వాళ్లు నన్నే తలుచుకుంటూ ఉంటారు అలాంటి వాళ్లలో అంబరీషుడు ఒకడు.
నన్నే నమ్ముకున్న వారి వెంట ఆవు దూడని రక్షించడం కోసం ఆవు పరిగెత్తినట్టు నా భక్తుల రక్షణ కోసం పరిగెడుతూ ఉంటాను, నీ వెనుక పరిగెడుతున్నది, నా రక్షణ కవచమైన సుదర్శనం, వాడు ఏమి చేశాడో అని చూడను, ఎన్ని వ్రతాలు, పూజలు చేశాడో అని చూడను, పరమ భక్తితో ఉన్నాడా అని చూస్తాను, పరమ భక్తికి నేను వసుడిని అయిపోతాను, అటువంటి వాళ్లని నేను పట్టుకుని ఉంటాను.
ఏమయ్యా దుర్వాస నువ్వు బ్రాహ్మణుడివి, గొప్ప తపస్సు చేశావు, ఎంత తపస్సు చేస్తే ఎవరికి కావాలి, నువ్వు ఎన్ని గొప్ప పనులు చేసిన, అవతలివారి అమాయకత్వాన్ని క్షమించగలిగిన విశాల హృదయం ఉందా? అవతలవాడి కష్టం తెలుసుకోగలిగిన మనసు ఉందా? లేదు. నీకు ఎప్పుడూ ఒక లక్షణం ఉండిపోయింది అది కోపం.. చిన్న అమర్యాద కలిగితే ఎందుకు జరిగిందని ఆలోచించకుండా కోపం పడిపోయి, కృత్యుని సృష్టించావు, కాబట్టి దుర్నీతిని పాటించావు, అలాంటి వాడికి ఎంత తపస్సు ఉన్న… ఎంత జ్ఞానం ఉన్న… వృధానే, ఇలాంటివాడు కష్టములను పొందుతాడు, అని విష్ణుమూర్తి అంటాడు. నేను ఎలా క్షమిస్తాను, క్షమించాల్సింది అంబరీషుడు ఆయన కాళ్లు పట్టుకో అని అంటాడు విష్ణుమూర్తి.
ఇప్పుడు పరుగు పరుగున అంబరీషుడు దగ్గరకి వెళ్తాడు, అంబరీషుడు సింహాసనం మీద కూర్చుని దుర్వాసుడు భోజనం చేయలేదని ఎంతో బాధతో ఆయన కూడా అప్పటికి భోజనం చేయకుండా ఉంటాడు, అది అంబరీషుడి ధర్మం. దుర్వాసుడు అంబరీషుడి పాదాల మీద పడి మహానుభావా నువ్వే నన్ను రక్షించాలి, ఈ సుదర్శన చక్రధారల నుంచి అంటాడు, అయ్యయ్యో అదేమిటి అని అంబరీషుడు సిగ్గుపడతాడు, ఎందుకంటే అంతటి మహాత్ముడు తన వలన కోపాన్ని పొంది, ఇన్ని కష్టాలు పడి, తన కాళ్లు పట్టుకున్నాడు, ఆయన తన కాళ్లు పట్టుకోవడం ఏమిటి అని సిగ్గుపడతాడు ఇది అంబరీషుడి మనస్సు.
అంబరీషుడు వెంటనే సుదర్శన చక్రానికి ప్రార్ధన చేస్తారు, సుదర్శన చక్రానికి, విష్ణుమూర్తికి భేదం లేని స్తోత్రం చేశాడు. నువ్వే మూలం, నువ్వే సృష్టి, నువ్వే లయ, నువ్వే రక్షణ, నువ్వే పృథ్వి, నువ్వే ఆకాశం అటువంటి సుదర్శనమా శరణాగతి చేసిన మునిని కాపాడు, నేను నీకు శరణాగతి చేస్తున్నాను, కోరిన వారికి నా దగ్గర ఉన్నది లేదనకుండా ఇచ్చిన వాడినైతే, నేను ఎప్పుడూ ధర్మం తప్పని వాడినైతే, నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషం పొందిన వాడినైతే, నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని తరుముతున్న సుదర్శనమా శాంతిని పొంది, నీ యధాస్థానానికి వెళ్ళిపోదువు గాక అని అన్నాడు అంబరీషుడు.
తను చేసిన తపస్సు నంతటిని ఒట్టు పెట్టాడు, దుర్వాసుడిని రక్షించడానికి, వెంటనే సుదర్శనం శాంతిని పొంది, వైకుంఠానికి వెళ్లిపోయింది. దుర్వాసుడు ఒక మాట అన్నాడు ఎందుకు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశాను, గృహస్థాశ్రమంలో నువ్వు పొందినది నేను పొందలేకపోయాను, శ్రీ మహా విష్ణువు యొక్క నామము ఒక్కసారైనా ప్రీతితో చెప్పిన, శ్రీమహావిష్ణువు పాదాలకు నమస్కరించిన వారికి ఏ కష్టములు అడ్డుకోవు.
అటువంటి శ్రీమన్నారాయణుడి నామస్మరణ చేసేవాడివి, నీ వైభవం ఏమిటో ఈరోజు చూశాను, మిత్రుడువై రక్షించావు, జీవితాన్ని ఇచ్చావు. ఇకనుంచి నీ పేరు అన్ని లోకములలో చెప్పుకుంటారు, మీ పేరు చెప్పుకున్నవారికి శ్రీమన్నారాయణుడి యందు భక్తి కలుగుతుంది, అని దుర్వాసుడు అంబరీషుడిని స్తోత్రం చేస్తాడు. అప్పుడు అంబరీషుడు మీరు బయలుదేరినప్పటి నుంచి ఇప్పటివరకు నేను భోజనం చేయలేదు, మీరు భోజనం చేస్తే ఆ భుక్తశేషం నేను భుజిస్తాను మీరు తినండి అన్నాడు.

పరమ సంతోషంతో దుర్వాసుడు కూర్చున్నాడు, దుర్వాసుడు తిన్నాక అంబరీషుడు తిన్నాడు, చాలా మంది వచ్చి దుర్వాసుడు అంతటివాడికి మదం అనిచారు అన్నారు, దానికి అంబరీషుడు తప్పు తప్పు శ్రీమన్నారాయణుడే రక్షించాడు, నన్ను రక్షించి దుర్వాసునికి పాఠం చెప్పాడు అన్నాడు.
ముగింపు:
Ambarisha Upakhyana కథ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, అది మనకు భక్తి, సహనం మరియు ధర్మపాలనలోని గొప్పతనాన్ని నేర్పుతుంది. అంబరీష మహారాజు ఆచరించిన ఏకాదశి వ్రతం మరియు ఆయనకు ఎదురైన పరీక్షల ద్వారా, భగవంతుడు తనను నమ్మిన భక్తుడిని ఏ ఆపదలోనైనా కాపాడుతాడని స్పష్టమవుతోంది. ముఖ్యంగా “నేను నా భక్తులకు దాసుడిని” అని శ్రీమహావిష్ణువు పలికిన మాటలు, భక్తి మార్గంలో ఉన్నవారికి కొండంత అండగా నిలుస్తాయి.
ఈ Ambarisha Upakhyana విశేషాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాము. మీరు కూడా ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించి, ఆ శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము.
మీకు ఈ వ్యాసం నచ్చితే:
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
వైకుంఠ ఏకాదశి 2025, ముక్కోటి ఏకాదశి తిథి ప్రారంభం మరియు ఉత్తర ద్వార దర్శన విశిష్టత ఇక్కడ చదవండి
మీకు ఈ వ్యాసం నచ్చితే:
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
📢 Join Our WhatsApp Channel here:







