Vaikunta Ekadashi 2025 | వైకుంఠ ఏకాదశి 2025, ముక్కోటి ఏకాదశి తిథి ప్రారంభం మరియు ఉత్తర ద్వార దర్శన విశిష్టత

Vaikunta Ekadashi 2025
Spread the love

Vaikunta Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి 2025, ముక్కోటి ఏకాదశి తిథి ప్రారంభం మరియు ఉత్తర ద్వార దర్శన విశిష్టత

Vaikunta Ekadashi 2025: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది వైష్ణవ ఆలయాల్లో ఈ పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. 2025వ సంవత్సరంలో ఈ పర్వదినం ఎప్పుడు వచ్చింది? ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వైకుంఠ ఏకాదశి: పుణ్యఫలం మరియు విశిష్టత

సాధారణంగా హిందూ పండుగలు చంద్రమానం లేదా సౌరమానం ఆధారంగా జరుగుతాయి. కానీ ఈ రెండింటితో సంబంధం లేకుండా జరుపుకునే అత్యంత విశిష్టమైన పండుగ ముక్కోటి ఏకాదశి. దీనినే ‘వైకుంఠ ఏకాదశి’ లేదా ‘స్వర్గపురి ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం, జాగరణ అనేవి కేవలం ఆచారాలు మాత్రమే కావు, అవి మోక్ష మార్గానికి సోపానాలని భక్తుల నమ్మకం. దీని విశిష్టతను ఈ క్రింది విధంగా చెప్పవచ్చు:

  • లక్ష్మీనారాయణుల అనుగ్రహం: ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో అర్చించడం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, దారిద్య్రం తొలగి సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విష్ణు పురాణం చెబుతోంది.

  • ఉపవాసం – ఆధ్యాత్మిక శుద్ధి: ఆహారాన్ని విడిచి పెట్టి మనస్సును దైవంపై లగ్నం చేయడం ద్వారా ఇంద్రియ నిగ్రహం లభిస్తుంది. ఇది భక్తుడిని మోక్ష మార్గంలో పయనించేలా చేస్తుంది.

  • జాగరణ – భక్తికి నిదర్శనం: రాత్రంతా నిద్రపోకుండా (జాగరణ) విష్ణు నామ సంకీర్తనలు చేయడం, భజనల్లో పాల్గొనడం లేదా శ్రీమద్భాగవత కథలను శ్రవణం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఈ విధంగా భగవంతుని స్మరణలో గడిపిన వారికి పునర్జన్మ లేని మోక్షం లభిస్తుందని శాస్త్ర వచనం.

📢 Join Our WhatsApp Channel here:

buttonvaikunta ekadashi 2025

Vaikunta Ekadashi 2025 Date and Time: December 30, 2025 – వైకుంఠ ఏకాదశి తేదీ మరియు సమయం:

తెలుగు పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, మంగళవారం నాడు వచ్చింది.

  • ఏకాదశి తిథి ప్రారంభం (Vaikunta Ekadasi Tithi Start December 30): డిసెంబర్ 30, 2025 నాడు ఉదయం 07:51 గంటలకు.

  • ఏకాదశి తిథి ముగింపు (Vaikunta Ekadasi Tithi End December 31): డిసెంబర్ 31, 2025 నాడు ఉదయం 05:01 గంటలకు.

  • ముఖ్య గమనిక: సూర్యోదయ తిథి ఆధారంగా డిసెంబర్ 30వ తేదీనే ప్రధానంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు మరియు ఉత్తర ద్వార దర్శనాలు నిర్వహించబడతాయి.

Mukkoti Ekadashi ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శన విశిష్టత:

వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువు ఆలయాల్లోని ‘ఉత్తర ద్వారం’ (వైకుంఠ ద్వారం) గుండానే ఎందుకు వెళ్తారు? దీనికి పురాణాలలో ఒక కథ ఉంది. పూర్వం “మురాసురుడు” అనే రాక్షసుడు విష్ణుమూర్తితో యుద్ధం చేసినప్పుడు మురాసురుడు  నీళ్లలో దాక్కుంటాడు, అతనితో యుద్ధం చేసి చివరికి విష్ణుమూర్తి విసిగిపోయి  వెళ్లి ఒక గుహలో నిద్రిస్తాడు, నీళ్లలో దాక్కున్న మురాసురుడు స్వామికి కనిపించడు, మురాసురుడు నీళ్లలో నుంచి బయటకు వచ్చి ఆ గుహలోనికి ప్రవేశించి, నిద్రిస్తున్నస్వామివారి మీద ఖడ్గం ఎత్తుతాడు.

ఖడ్గం ఎత్తేసరికి నిద్ర ముద్రాభిరాముడుగా ఉన్నటువంటి విష్ణు మూర్తి నుంచి ఆయన తేజస్సు, ఒక  కళ  కన్యకా రూపంలో వచ్చి ఆ మురాసురుడుని సంహరించింది, తనలో నుంచి ఉద్భవించిన కళకి విష్ణుమూర్తి “ఏకాదశి” అని నామకరణం చేశారు, ఆమె తిధులలో ఒకటయ్యింది. ఆమె ఆ రాక్షసుడిని వధించడంతో ప్రసన్నుడైన విష్ణువు ఆమెకు ఒక వరం ఇచ్చారు. ఆ రోజున వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని, ఆ ద్వారం గుండా తనను దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని స్వామి వరమిచ్చారు.

vaikunta ekadashi 2025

అందుకే ఉత్తర ద్వారాన్ని ‘మోక్ష ద్వారం’ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ రోజున చేసే ఆధ్యాత్మిక సాధనలకు అనంతమైన ఫలితం ఉంటుంది.

  1. ఉత్తర ద్వార దర్శనం: ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ‘ఉత్తర ద్వారం’ గుండా స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.

  2. ముక్కోటి దేవతల దర్శనం: ఈ రోజున శ్రీమహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేస్తాడని, అందుకే దీనికి ‘ముక్కోటి ఏకాదశి’ అనే పేరు వచ్చిందని చెబుతారు.

  3. సాగర మథనం: క్షీర సాగర మథనం సమయంలో అమృతం ఉద్భవించిన రోజు కూడా ఇదేనని పురాణ గాథలు పేర్కొంటున్నాయి. పరమేశ్వరుడు హాలాహలాన్ని  తాగాడు.

  4. గీతా జయంతి: కురుక్షేత్ర యుద్ధం సమయంలో ఇదే రోజున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ‘భగవద్గీత’ను బోధించారని నమ్మకం. అందుకే ఈ రోజును ‘గీతా జయంతి’గా కూడా జరుపుకుంటారు.

ఏకాదశి వ్రతం – శైవ, వైష్ణవ, శాక్తేయ మతాల అంతరార్థం:

  • పరమేశ్వరుడు లోకం కోసం హాలాహలాన్ని  త్రాగాడు కాబట్టి  ఆ రోజున నేను  ఏమీ తినకుండా ఉంటాం  అంటారు  శైవులు.
  • అమృతాన్ని లోకం కోసం ఉత్పాదించి మహాకూర్మంగా పాలసముద్రంలో పడుకుని ఆయన వీపు వరుసుకుపోతున్న  దేవతలకు  అమృతోత్పాదన చేసి  వాళ్ళని  కాపాడి  రాక్షసులని  మోహిని రూపంలో  నిగ్రహించాడు కాబట్టి విష్ణు స్వరూపం కోసం ఉపవాసం చేస్తామంటారు వైష్ణవులు.
  • పాలసముద్ర మథన సమయంలో ఉద్భవించిన అమృతాన్ని రాక్షసులకు చిక్కకుండా, కేవలం దేవతలకు మాత్రమే పంచడానికి శ్రీమహావిష్ణువు ‘మోహిని’ అవతారాన్ని ఎత్తాడు. రాక్షసులను సైతం మంత్రముగ్ధులను చేయగలిగే అంతటి అద్భుత సౌందర్యాన్ని పొందడానికి విష్ణువు ఆదిపరాశక్తిని ఉపాసించాడని, ఆ అమ్మవారి అనుగ్రహంతోనే ఆయనకు ఆ మోహినీ రూపం సాధ్యమైందని శాక్తేయుల నమ్మకం. లోక కల్యాణం కోసం అమ్మవారు విష్ణుమూర్తికి అటువంటి అదృష్టాన్ని, శక్తిని ప్రసాదించినందుకు కృతజ్ఞతగా శాక్తేయులు ఈ పవిత్ర ఏకాదశి రోజున ఉపవాసం ఆచరిస్తారు.
  • ఇన్ని  కార్యాలు  జరిగాయి అంటే  ఏ విఘ్నం లేకుండా చేసిన వాడు మా గణపతి కాబట్టి మేము ఈరోజు ఉపవాసం ఉంటాం అంటారు “ఘనపత్యులు”.

Ambarisha Upakhyana Ekadashi Vratam – అంబరీషోపాఖ్యానం: ఏకాదశి వ్రత మహత్యం ఇక్కడ చదవండి 

Fasting benefits of Vaikunta Ekadashi 2025 – వైకుంఠ ఏకాదశి ఉపవాస దీక్షతో ఈ ఫలితాలు:

  • ఉపవాసం: ఏకాదశి నాడు అన్నం విడిచిపెట్టి ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యం. దీనివల్ల మనస్సు మరియు శరీరం శుద్ధి అవుతాయి. 8 ఏళ్ల లోపు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు, శారీరక శ్రమ చేసే వారికి మరియు అనారోగ్యంతో ఉన్నవారికి ఉపవాస నియమం నుండి మినహాయింపు ఉంది. కళ్ళు తిరిగి పడిపోయే స్థితి వస్తే, శరీరాన్ని నిలబెట్టుకోవడానికి స్వల్పంగా ఆహారం తీసుకోవచ్చు.

  • జాగరణ: రాత్రంతా నిద్రపోకుండా భగవన్నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు చేయడం ద్వారా విష్ణువు అనుగ్రహం పొందవచ్చు. ఏకాదశి రోజు పగలు కానీ, రాత్రి కానీ నిద్రించకూడదు. మనలోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు (మొత్తం 11) కలిపి భగవంతునిపై లగ్నం చేయాలి. ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచి చేసే ఉపవాసం వల్ల మూడు కోట్ల ఏకాదశులు చేసిన పుణ్యఫలం లభిస్తుంది.

  • తులసి పూజ: విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

  • ద్వాదశి పారణ: ఏకాదశి తిథి ముగిసి, ద్వాదశి గడియలు రాగానే భోజనం చేయడం (పారణ) చాలా ముఖ్యం. పురుషులు శ్రద్ధతో, భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాత తమ ఇంట్లోనే భోజనం చేయాలి.

సుదీర్ఘ ఉపవాసం తర్వాత ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. అందుకే ద్వాదశి రోజున మితంగా భోజనం చేయాలి. నిజానికి దశమి నాడు మొదలైన ఈ నియమం ఏకాదశి మీదుగా సాగి ద్వాదశితో పూర్తవుతుంది. ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు వంటి అల్పాహారం తీసుకోవచ్చు. అయితే, ఈ రోజున మురాసురుడు బియ్యంలో నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి, అందుకే బియ్యంతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఏకాదశి రోజు ఉపవాసలు చేయడం ద్వాదశి రోజు పారణ చేయడం అత్యంత ప్రీతిపాత్రమైన విషయం విష్ణుమూర్తికి. ఈ ఏకాదశులు ప్రతినెల రెండుసార్లు వస్తాయి. “శుద్ధ ఏకాదశి”, “బహుళ ఏకాదశి” ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైన పేరు కూడా ఉంటుంది. మొట్టమొదటిది  చాతుర్మాస్య దీక్ష ప్రారంభమవుతుంది  ఆషాడంలో, ఆషాడశుద్ధ ఏకాదశి రోజు, తొలి ఏకాదశి అంటాం, ఆ రోజు స్వామి  పడుకుంటారు,  కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు, ఈ మధ్యలో నాలుగు నెలల కాలం విష్ణుమూర్తికి “యోగనిద్ర” కాలమని చెప్తారు.

1. మూడు కోట్ల ఏకాదశుల పుణ్యఫలం: సాధారణ మానవ ఆయుర్దాయంలో మూడు కోట్ల ఏకాదశులు ఆచరించడం అసాధ్యం. కానీ, భగవంతుడు అత్యంత దయామయుడు. నిరంతరం మూడు కోట్ల ఏకాదశులు చేస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో, అంతటి మహా ఫలాన్ని కేవలం ఈ ఒక్క ‘ముక్కోటి ఏకాదశి’ నాడే మన ఖాతాలో వేస్తాడు. అందుకే అన్ని సంప్రదాయాల వారు ఈ రోజున ఉపవాసం ఉంటారు.

2. శరీరం – ఒక చెరకు గడ: శాస్త్రం మన శరీరాన్ని ఒక చెరకు గడతో (ఇక్షుదండం) పోలుస్తుంది. చెరకు గడను గానుగలో పెట్టి పిండితేనే తీయని రసం, బెల్లం, పంచదార ఎలా వస్తాయో.. మన శరీరాన్ని కూడా వ్రత నియమాలతో కష్టపెట్టినప్పుడే ఆధ్యాత్మిక ఫలితం లభిస్తుంది. దక్షిణాయన పుణ్యకాలం ఈశ్వర ఆరాధనకు ఎంతో అనువైనది. అయితే, ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల సుఖానికి అలవాటు పడిన శరీరం తెల్లవారుజామున నిద్రలేవడానికి, స్నానానికి, ఉపాసనకు సహకరించదు. కానీ, ప్రకృతి ఇచ్చే ఆ సుఖాన్ని కాదని, శరీరాన్ని కష్టపెట్టి ఎవరైతే భగవంతుని ధ్యానిస్తారో, వారికే జన్మ సార్థకత లభిస్తుంది.

3. స్వయం కృషి – వ్యక్తిగత సాధన: ఏకాదశి వ్రతం అనేది ఎవరికి వారు స్వయంగా ఆచరించాల్సిన ప్రక్రియ. ఇది ఒకరి కోసం మరొకరు (భర్త కోసం భార్య లేదా భార్య కోసం భర్త) చేసేది కాదు. ఎవరి ఆకలి వారిదే అన్నట్లు, ఎవరి సాధన వారిదే. ఎవరైతే ప్రయత్నపూర్వకంగా తమ శరీరాన్ని నియంత్రించి, మనసును ఈశ్వరుడి వైపు తిప్పగలరో, వారే నిజమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించగలరు.

ముక్కోటి ఏకాదశి ఎవరు చేయాలి?

వ్రతములు అన్నింటిలో విలక్షణమైన వ్రతం ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం బ్రహ్మచారి చేయాలి, గృహస్తు చేయాలి, సన్యాసి చేయాలి, అందరూ చేయాలి. ఏకాదశి వ్రతం అన్ని సాంప్రదాయాల వారు చేయాలి  ఏకాదశి వ్రతం, ఆ ఏకాదశి ప్రతినెలలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి వస్తుంది (నెలకి రెండు ఏకాదశులు – అమావాస్యకి ముందు ఒకటి, పౌర్ణమికి ముందు ఒకటి) సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశిలు వస్తాయి, ఒక్కొక్క ఏకాదశిని  ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ప్రత్యేకించి పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని “ముక్కోటి ఏకాదశి” లేదా  “వైకుంఠ  ఏకాదశి”  అని పిలుస్తారు.

Which Temples to Visit on Vaikunta Ekadashi 2025 – వైకుంఠ ఏకాదశి నాడు ఏ ఆలయాలను దర్శించాలి?

ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణలు మోక్షదాయకమని భక్తుల నమ్మకం. ఇవన్నీ చేయలేని వారు కనీసం “ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ పర్వదినాన విష్ణుమూర్తి లేదా వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవడంతో పాటు ఉపవాసం, జాగరణ, జపం మరియు ధ్యానం వంటివి ఆచరించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి.

గోదాదేవి రోజుకో పాసురంతో శ్రీహరిని స్తుతించి, స్వామిని పతిగా పొందిన ఈ మాసంలో సౌరమానం ప్రకారం ఈ పండుగను జరుపుకుంటారు. ప్రసిద్ధ వైష్ణవ భక్తుడు శ్రీ నమ్మాళ్వార్ ఈ పవిత్ర రోజే విష్ణులోకం చేరారని, అందుకే దీనికి ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత చేకూరిందని ప్రతీతి.

ఈ పర్వదినాన తిరుమల వంటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) తెరుస్తారు. ఈ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఏకాదశి నాడు మలయప్ప స్వామివారి ఊరేగింపును దర్శించి, మరుసటి రోజైన ద్వాదశి నాడు తిరుమల స్వామి పుష్కరిణిలో చక్రస్నానం ఆచరించడం వల్ల ముక్కోటి తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన వివరాలు:

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు (10 రోజుల పాటు) భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. తొలి మూడు రోజులకు (డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1) సంబంధించి నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ‘డిప్’ పద్ధతిలో ఉచిత సర్వదర్శన టోకెన్లు కేటాయిస్తారు. ఇక జనవరి 2 నుండి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా భక్తులకు నేరుగా సర్వదర్శనం కల్పిస్తారు.

Srirangam Vaikuntha Ekadashi celebrations:

vaikunta ekadashi 2025

నిజానికి ఉత్తర ద్వార దర్శనం శ్రీరంగ క్షేత్రానికి సంబంధించింది. అందరూ అక్కడికి వెళ్లలేరు కాబట్టి, మన సమీపంలోని విష్ణు క్షేత్రాలనే శ్రీరంగంగా భావించి ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటాం. శ్రీరంగంలోని ప్రసిద్ధ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి.

ఈ వేడుకలను రెండు భాగాలుగా విభజిస్తారు: మొదటిది ‘పాగల్ పట్టు’ (పగటి పూజలు), రెండవది ‘ఇర పట్టు’ (రాత్రి పూజలు). ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని అపురూపమైన వజ్ర కవచంతో అలంకరించి, వైకుంఠ ద్వారం గుండా వెయ్యి స్తంభాల మండపానికి ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ పవిత్ర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్న భక్తులకు నేరుగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శరణాగతి: “స్వామీ! నువ్వు తప్ప నాకు ఎవరూ దిక్కు లేరు” అని ఆర్తితో ఎవరైతే శరణు వేడుతారో, వారిని భగవంతుడు ఉత్తర ద్వారం గుండా తన సాన్నిధ్యానికి (మోక్షానికి) తీసుకెళ్తాడు.

ముగింపు:

Vaikunta Ekadashi 2025 కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన మనస్సును, శరీరాన్ని భగవంతుని వైపు మళ్లించే ఒక అద్భుత అవకాశం. మనం ఎంత భక్తితో చేశాం, ఎంత గొప్పగా చేశాం అన్నదానికంటే, ఎంత ‘ఆర్తి’తో (తపనతో) చేశామన్నదే ముఖ్యం. మన శక్తి మేరకు, మనకు చేతనైనంతలో శరణాగతి భావంతో ఒక్క నమస్కారం చేసినా, ఆ దయామయుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ శ్రీమన్నారాయణుని కృపాకటాక్షాలతో మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకట్లు తొలగి, సుఖశాంతులు చేకూరాలని కోరుకుందాం. ఈ పవిత్ర పర్వదినాన నిష్టతో ఉపవాసం ఉండి, ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని మోక్ష మార్గంలో పయనిద్దాం. ఈ వైకుంఠ ఏకాదశి 2025 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మంగళప్రదం కావాలని ఆశిస్తున్నాము. ఓం నమో నారాయణాయ!”

“మీరు ఈ ఏడాది ఏ ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటున్నారు? మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి!”

Ambarisha Upakhyana Ekadashi Vratam – అంబరీషోపాఖ్యానం: ఏకాదశి వ్రత మహత్యం ఇక్కడ చదవండి 

మీకు ఈ వ్యాసం నచ్చితే:

  • ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.

  • మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.

  • మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

📢 Join Our WhatsApp Channel here:

button



Spread the love

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *